కర్ణాటకలో ఓ విచిత్రమైన పోస్టర్లు వెలిశాయి. తమ చిలుక కనిపించకుండా పోయిందని.. ఆచూకీ చెబితే రూ.50వేలు ఇస్తామంటూ ఓ కుటుంబం పోస్టర్లు వేసింది. దీంతో అందరూ వీటిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. 

కర్ణాటక : తమకు ఎంతో ఇష్టమైన…ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు చిలకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం విలవిల్లాడిపోతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలక కోసం రేయింబవళ్ళూ వెతుకుతోంది. ఆచూకీ చెప్పినవారికి రూ. 50,000 నజరానా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు. ఈ ఆసక్తికర ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తుమకూరులోని జయనగర్ లో నివాసం ఉంటున్న కుటుంబం గత రెండున్నరేళ్లుగా రెండు ఆఫ్రికన్ చిలుకలు పెంచుకుంటుంది.

వాటిని ఇంటి సభ్యులుగానే భావించేవారు. ఏటా వాటి పుట్టిన రోజులను ఘనంగా నిర్వహించేవారట. కానీ ఈసారి రుస్తుం అనే చిలుక జూలై 16 నుంచి కనబడకపోవడంతో దానికోసం వెతుకుతూ నగరమంతటా పోస్టర్లు అతికించారు. ‘ఆ చిలుకను మేము ఎంతో మిస్ అవుతున్నాం. అది మా కుటుంబంలాగే. మీ బాల్కనీల్లో, కిటికీల వద్ద కనబడితే గుర్తించి మాకు చెప్పి సహాయం చేయండి. ఆ చిలుకతో మాకెంతో అటాచ్మెంట్ ఉంది. ఎక్కడైనా చూస్తే చెప్పండి. ఆచూకీ చెప్పినవారికి మేం. రూ. 50,000 అందజేస్తాం’ అని ఆ చిలుకను పెంచుకున్న కుటుంబ సభ్యులు పల్లవి, అర్జున్ తెలిపారు. 

వింత అనుభవం: వేలిముద్రలు కనబడుటలేదు

ఇలాంటి విచిత్రమైన ఘటనే ఈ నెల మొదట్లో.. అంటే జూలై 7న తమిళనాడులో జరిగింది. పెన్ను పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అది కూడా ఎవరో చిన్నా, చితకా మనుషులు కాదు... ఓ ఎంపీ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ తన పెన్ను పోయింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విజయ్ వసంతన్ పెన్ను పోయింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. అది మౌంట్ బ్లాంక్ ఫౌంటెన్ పెన్ అని.. దాని విలువ దాదాపు లక్షా 50 వేల రూపాయలు అని తెలిపారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూలై 30న చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా గిండీలోని స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తన పెన్నును ఎవరో దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘నా పెన్ను వెతికి పెట్టండి..’ కాంగ్రెస్ ఎంపీ పోలీస్ ఫిర్యాదు..

‘మా నాన్న ఆ పెన్నును వాడేవారు. ఆయన చనిపోయాక.. దాదాపు రెండేళ్ల నుంచి ఆయన జ్ఞాపకార్థం ఆ పెన్నును నేను ఉపయోగిస్తున్నారు. ఇటీవల గిండీలో జరిగిన సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అప్పుడు నా దగ్గర పెన్ను ఉంది. కొద్దిసేపటి తర్వాత కనిపించలేదు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, డీఎంకే కూటమిలోని సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బయటి వ్యక్తులు ఎవరూ రాలేదు. రద్దీ ఎక్కువగా ఉండడంతో జేబులోంచి నా పెన్ను జారి కిందపడిపోయి ఉండవచ్చు.

హోటల్ యాజమాన్యం సీసీటీవీ రికార్డును చెక్ చేయమని అడిగాను. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తామని హోటల్ యాజమాన్యం వారు తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పుకొచ్చారు.