Asianet News TeluguAsianet News Telugu

వింత అనుభవం: వేలిముద్రలు కనబడుటలేదు

సంతకానికైనా ఫోర్జరీ ఉంటుందేమో కానీ వేలిముద్రలకు ఉండదు. ప్రతి మనిషి వేలిముద్రలు యునిక్. అందుకే అతి ముఖ్యమైన గుర్తింపు విషయాల్లో చదువుకున్నారా లేదా అనేదానితో సంబంధం లేకుండా వేలిముద్రలనే ఆధారంగా తీసుకుంటారు.

Journalist Suma bala's experience: Finger prints missing
Author
Jangaon, First Published Mar 7, 2019, 1:43 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నా వేలి ముద్రలు పోయాయి...ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది. ఎలా పోయాయి? ఎక్కడికి పోయాయి? అసలెలా పోతాయి? అని కూడా అనిపించింది. కానీ అతని మాటలు విన్న తరువాత, రుజువులు చూపించిన తరువాత కానీ దాన్ని నేను నమ్మలేకపోయాను.

సంతకానికైనా ఫోర్జరీ ఉంటుందేమో కానీ వేలిముద్రలకు ఉండదు. ప్రతి మనిషి వేలిముద్రలు యునిక్. అందుకే అతి ముఖ్యమైన గుర్తింపు విషయాల్లో చదువుకున్నారా లేదా అనేదానితో సంబంధం లేకుండా వేలిముద్రలనే ఆధారంగా తీసుకుంటారు. అలాంటిది వేలిముద్రలే లేకపోతే..ఆ మనిషి గుర్తింపు ఏంటి?

నిన్నటి నా అనుభవం ఇలాంటిదే. జనగాం నుండి హైదరాబాద్ కు బస్సు ప్రయాణం. విపరీతమైన రద్దీ. అప్పటికి 6,7 బస్సులు వదిలేసినా రద్దీ తగ్గడం లేదు. చివరికి ఒక బస్సులో ఎలాగో ఒక సీటు దొరికింది. అదీ కాస్త రౌడీయిజం చేస్తేనే. నిండుకుండలా ఉన్న బస్సు కదిలింది. సీట్ల కోసం గొడవలు, తిట్టుకోవడాలు నడుస్తున్నాయి ఓ వైపు. మరోవైపు కండక్టర్ టికెట్లు కొడుతున్నాడు.

నేను నా జర్నలిస్టు పాస్ చూపించి టికెట్ తీసుకున్నాను. సీట్ల గొడవ కూడా ఓ కొలిక్కి వచ్చనట్టుంది. బస్సు శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఇంతలో అమ్మా...అని పిలుపు...పక్కకు చూస్తే నా పక్కన కూర్చున్న పల్లెటూరి జంట. మీరు జర్నలిస్టా? అని అడిగాడు అతను. తలాడించాను. తనను, భార్యను, పిల్లాడిని పరిచయం చేసుకున్నాడు. అమ్మా నాకో సాయం చేసి పెడతారా..ఒక అర్థింపు. నేనతనికి ఏం సాయం చేయగలనో తెలియదు..కానీ ముందే కాదనలేం కదా...ఏంటి అని అడిగా.

రేషన్ కార్డ్ మీద బియ్యం ఇస్తారు కదమ్మా...అవి మాకు సరిపోవడం లేదు అని మొదలుపెట్టాడు నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తలా ఆరు కిలోలు కదా ఇస్తారు. అంతకంటే ఎక్కువివ్వడానికి కుదరదు కదా అన్నా. అది కాదమ్మా..మా పక్కింటి వాళ్లింట్లో ముగ్గురే ఉన్నారు కానీ వాళ్లకు 30 కిలోల బియ్యం వస్తున్నాయి. నాకు వచ్చే 24 కిలోలు సరిపోవడం లేదు. వాళ్లేమో ఆ బియ్యం తినరు. అమ్ముకుంటారు. కొనుక్కుందామంటే రేషన్ కార్డుమీద ఒక్కరూపాయికి వచ్చే బియ్యాన్ని పది రూపాలకు కిలో అని అమ్ముతున్నారు. పక్కింటి వాడే కదా...బీదోడు కదా అని రెండు రూపాయలు కూడా తగ్గించడం లేదమ్మా. ఏం చెప్పాలో తోచలేదు.

తిననోళ్లకు ఎందుకమ్మా బియ్యం ఇచ్చుడు అని అడుగుతున్నాడు. మా ఊర్లో చాలామంది ఇట్లనే అమ్ముకుంటున్నరమ్మా. వాళ్లకు పొలాలున్నై, సొంత ఇండ్లున్నయ్..మళ్లా తెల్లరేషన్ కారట్ ఉంది. అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. ఇక నాకు నోరు విప్పక తప్పలేదు. అలా కాదు...రేషన్ కార్డులో పేర్లు ఎంతమంది ఉంటే అంతమంది లెక్కన ఇస్తారు. వాళ్లింట్లో పేర్లు ఎక్కువున్నయేమో అది కంప్లైంట్ చేయండి అని చెప్పా. రేషన్ షాపు సేటమ్మని అడిగినమమ్మా కనీ అట్లా ఏం లేదు అంటుంది. మా ఇంట్ల మా కార్డు మీద గూడా మా చెల్లెయి, తమ్ముండ్లయి పేర్లుండే...వాళ్లకు పెండ్లిళ్లు కాంగనే వాళ్ల పేర్లు కొట్టేసిండ్రు. వీళ్లకు ఎందుకు కొట్టెయ్యలేదో మరీ అని మరో డౌట్.

మీది ఏ ఊరు అని అడిగా రఘునాథ్ పల్లి మండల్ శ్రీమన్నారాయణపురం అని చెప్పుకొచ్చాడు. ఊరిపేరు సరిగానే విన్నానో లేదో మరి. ఊర్లోనే కాదు సిటీలో కూడా చాలామంది ఇదే పని చేస్తారు. తెల్ల రేషన్ కార్డుకు అర్హులు కాకపోయినా కార్డును వదలరు. సొంత ఇండ్లు, పొలాలు, ఆస్తులు ఉన్నా రేషన్ కార్డు మీద వచ్చే రూపాయి బియ్యాన్ని పోనివ్వరు. అవే బియ్యం కిరాణాషాపుల్లో పది నుండి 18 రూపాయలకు కిలో బియ్యంగా మారుతుంటాయి.

ఇప్పుడు ఇతని సమస్య వింటుంటే ఇలాంటి వాళ్ల కోసమే కదా బియ్యం ఇచ్చేది అవి వారికి సరిగ్గా చేరుతున్నాయా అనిపించింది. ఇంకొక్క ఆరుకిలోలు ఇస్తే మాకు నెలంతా గడిచిపోతుందమ్మా అని అతని భార్య అంటోంది. ప్రభుత్వం ప్రకటించే ఏ పథకం అయినా సరిగ్గా లభ్ది దారునికి చేరితేనే కదా అసలైన ఫలితం.

నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. నేనేం మాట్లాడకపోవడంతో అతను మరో మాటగా నాకు వేలిముద్రలు కూడా లేవమ్మా అన్నాడు. నా ఆలోచనలు తెగిపోయాయి. అదేంటి వేలిముద్రలు లేకపోవడం ఏంటీ అని అడిగా. వేలిముద్రలు పోయాయమ్మా. మళ్లీ చెప్పాడు. అందుకే నా భార్య వేలిముద్రలు వాడుతున్నాం అని కూడా చెప్పాడు. మా చిన్నోడివి పనికిరావన్నారు. నాయి మళ్లా రావాల్నేంట ఏం చేయాలి అడుగుతున్నాడు.

చిన్నపిల్లలవి పెరిగిన తరువాత మార్పు వస్తుందని తీసుకోరు అని చెప్పా. నీ వేలిముద్రలు ఎలా పోయాయి. అలా పోవు కదా. నా ధర్మసందేహం. మేము బతకనీకి రాయగిరికి పోయినమమ్మ. నెలనెలా రాషన్ తీసుకోవాల్నంటే వేలిముద్ర వేయాలె. ఈనదేమో పడ్తలేదు. నెలనెలా నేనొచ్చి తీస్కపోవాల్సొస్తుంది. ఆ రోజు పనికి బంద్ వెట్టాలె. కూలీ పోతుంది భార్య ఆవేదన.

ఇవేవీ నా బుర్రలోకి ఎక్కడం లేదు. వేలిముద్రలు పోవడం ఏంటీ, తిరిగి రావాలంటే ఏం చేయాలి అనే దగ్గరే ఆగిపోయాయి. నమ్మడం లేదనుకున్నాడో ఏమో... అతను తన రెండు అరచేతులను నా ముందు పెట్టాడు. పదివేళ్లూ ప్రయత్నించారమ్మా వేలిముద్రలు ఒస్తలేవు అన్నాడు. ఎందుకో అర్థం కాలేదు. వేళ్లు బండబారిపోయి ఉన్నాయి. ఏం పని చేస్తారు అని అడిగా. రింగులు పోస్తాం అన్నారు.

సిమెంటు పని. మోటుపని..దాంతో వేళ్లు మృదుత్వం కోల్పోయాయి. ఇలాంటి వాళ్లు ఎంత మందో. సిమెంటు పనిలో, మట్టిపనిలో, నిర్మాణరంగంలో ఉండే కార్మికులు, రోజువారీ కూలీపనులు చేసేవాళ్లు..ఎంతమంది వేలిముద్రలు కోల్పోయారో...మన రోజువారీ హడావుడి జీవితాల్లో కనీసం సమస్యగా కూడా కనిపించని ఇలాంటివి వారికి జీవన్మరణ సమస్యలు.

జీవనాధారానికి చేసే పనులు వారి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. కనీస గుర్తింపు లేకుండా చేస్తున్నాయి. ఆలోచనలు తెగడం లేదు. ఇంతలో రాయగిరి వచ్చింది వాళ్లు దిగిపోయారు. కానీ నేను చెదిరిపోయిన వేలిముద్రలు మళ్లీ తెప్పించడం  ఎలా అన్నదగ్గరే ఆగిపోయాను. నిజంగా అది సాధ్యమవుతుందా? ఇలాంటి వేలాదిమంది పేదవారికి గుర్తింపు దొరుకుతుందా?

_ సుమబాల
ఫోటోస్ : కందుకూరి రమేష్ బాబు

Follow Us:
Download App:
  • android
  • ios