ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే గతంలో కూడా ప్రధానికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బఠిండా నుంచి హుస్సేనివాలాకు వెళ్తుండగా మోదీ కాన్వాయ్.. ఫ్లై ఓవర్‌పై 15 నుంచి 20 నిమిషాల పాటు చిక్కుకుపోయింది. మోదీ వెళ్తున్న మార్గంలోనే రైతులు రోడ్డును అడ్డగించి నిరసనల తెలుపడమే ఇందుకు కారణం. దీంతో మోదీ తన పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ చేరుకన్నారు.PM Modi security lapseపై కేంద్ర హోం శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం.. రైతులు ఆకస్మాత్తుగా వచ్చి ప్రధానిని అడ్డుకున్నారని.. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే గతంలో కూడా ప్రధానికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ ఘటనకు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలనే డిమాండ్ వినిపిస్తున్న సమయంలో.. 2017లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రధాని మోదీ కాన్వాయ్ రెండు గంటలపాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయిందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అది నిజం అని భావించిన కొందరు అప్పుడు లేని ప్రమాదం.. ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ప్రధాని మోదీ వెళ్తున్న రూట్ వాళ్లే మాకు లీక్ చేశారు.. రైతు సంఘం నేత సంచలన వ్యాఖ్యలు..
అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. 2017లో అసలే ఏం జరిగిందనేది తెలుసుకోవాలని పలువురు సోషల్ మీడియా యూజర్లు.. అటువంటి కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు హితవు పలుకుతున్నారు. ఆ సమయంలో ఇందుకు సంబంధించి ప్రముఖ మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను కూడా వారు గుర్తుచేస్తున్నారు. తప్పుడు వార్తను ప్రచారం చేసి తర్వాత తొలగించారని.. కనీసం క్లారిటీ ఇవ్వడం, క్షమాపణ చెప్పడం లేదంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి ఒక ట్వీట్‌ను ఇక్కడ చూడవచ్చు.
అసలు 2017లో ఏం జరిగిందంటే..
2017లో ప్రధాని మోదీ కాన్వాయ్ నోయిడాలో రెండు నిమిషాలు ఇరుక్కుపోయింది. డిసెంబర్ 25న మోదీ నోయిడాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ రాంగ్ రూట్‌లో వెళ్లింది. ఇద్దరు పోలీసులు రాంగ్ టర్న్ తీసుకోవడం వల్ల ఇది జరిగింది. అయితే దీనిని వెంటనే గుర్తించిన అధికారులు.. వెంటనే సరైన మార్గంలోకి మళ్లించారు. ఈ క్రమంలోనే మహామాయ ఫ్లై ఓవర్ సమీపంలో మోదీ కాన్వాయ్ రెండు నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసు వేగంగా స్పందించి.. రూట్ క్లియర్ చేశారు. ఆ తర్వాత మోదీ కాన్వాయ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగింది. తర్వాత ఈ ఘటనకు కారణమైన ఇద్దరు పోలీసుల అధికారులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని నియమించిన పంజాబ్ ప్రభుత్వం..
ప్రధాని మోదీ పర్యటనలో భద్రత వైఫల్యాలపై కేంద్ర హోం శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తు చేసేందుకు అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించింది. రిటైర్డ్ జస్టిస్ మెహతాబ్ సింగ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం అఫైర్స్ అండ్ జస్టిస్) అనురాగ్ వర్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
