ప్రధాని మోదీ వెళ్తున్న రూట్ వాళ్లే మాకు లీక్ చేశారు.. రైతు సంఘం నేత సంచలన వ్యాఖ్యలు..
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనియన్ (Bhartiya Kisan Union) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మోదీ కాన్వాయ్ బఠిండా నుంచి ఫిరోజ్‌పూర్‌లోని హుస్సేనీవాలాకు వెళ్తున్న మార్గాన్ని రైతులు నిర్భంధించడంతో ఆయన 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైన చిక్కుకుపోయారు. అనంతరం తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే ఈ సందర్భంగా బఠిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ పంజాబ్ అధికారులతో .. ‘ప్రాణాలతో తిరిగి రాగలిగాను.. మీ సీఎంకు నా తరఫున ధన్యవాదాలు చెప్పండి’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాని భద్రతా ఏర్పాట్లలో పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాత్రం.. రైతులు ఆకస్మాత్తుగా వచ్చి ప్రధానిని అడ్డుకున్నారని.. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరి హింసకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని కిసాన్ మజ్దూర్ సంఘర్స్ కమిటీ ఈ ఆందోళన చేపట్టిందని అన్నారు.
అయితే ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనియన్ (Bhartiya Kisan Union) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రధాన మంత్రి భద్రతా ఉల్లంఘనలో తమ పాత్ర ఉందని బీకేయూకు చెందిన సుర్జిత్ సింగ్ ఫూల్ (Surjeet Singh Phool) పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థ మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని రూట్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు పంజాబ్ పోలీసులు లీక్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రధాని భద్రత లోపంలో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో బీకేయూ నేత చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీని మరింతగా కార్నర్ చేసేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.