అవకాశవాదం కాదు, పార్టీని కాపాడుకోవడానికే బీజేపీతో పొత్తు .. దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ , జేడీఎస్ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ. జేడీఎస్‌కు అధికార దాహం లేదని, అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. తమ పార్టీని కాపాడుకునే ఉద్దేశంతోనే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కర్ణాటకకు చెందిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ ఎన్డీయే గూటికి చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంపై ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి వుందని.. మైనార్టీలను నిరాశపరచబోమన్నారు. జేడీఎస్‌కు అధికార దాహం లేదని, అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. తమ పార్టీని కాపాడుకునే ఉద్దేశంతోనే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు.
గత పదేళ్లలో తొలిసారిగా అమిత్ షాతో మాట్లాడానని ఆయన వెల్లడించారు. కుమారస్వామి బీజేపీ నేతలను కలవడానికి ముందే తాను షాను కలిసినట్లు దేవెగౌడ చెప్పారు. పొత్తు నిర్ణయం తీసుకునే ముందు పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నామని దేవెగౌడ పేర్కొన్నారు. తమను బీజేపీకి బీటీమ్ అంటూ రాహుల్ అంటున్నారని.. ఇది కాంగ్రెస్ తమ పార్టీకి ఇచ్చిన సర్టిఫికెట్ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పొత్తు నిర్ణయం తానే తీసుకున్నానని.. పార్టీని కాపాడుకోవాలనే ఇలా చేసినట్లు దేవెగౌడ చెప్పారు.
Also Read: ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. జేపీ నడ్డా ప్రకటన
కాగా.. దేవేగౌడ, హెచ్ డీ కుమారస్వామి ఇద్దరూ పార్లమెంటులో అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన మరుసటి రోజే పొత్తు నిర్ణయం బయటికి వచ్చింది. కర్ణాటకలో 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తు గురించి వీరు చర్చించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తున్నదని కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప పేర్కొన్నప్పుడు తొలిసారిగా ఈ రెండు పార్టీల పొత్తు గురించి చర్చ జరిగింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అప్పుడు కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. హెచ్ డీ కుమారస్వామి సారథ్యంలో ఆ ప్రభుత్వం ఉన్నది. ఇటీవలే జేడీఎస్, బీజేపీ కలవనున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు కర్ణాటకలోని మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాల్లో జేడీఎస్ నాలుగు చోట్ల పోటీ చేస్తుందని, మిగిలిన చోట్ల బీజేపీ పోటీ చేయడానికి నిర్ణయం జరిగినట్టు కథనాలు వచ్చాయి.