ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. జేపీ నడ్డా ప్రకటన
కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. ఈ రోజు జేడీఎస్ లీడర్ హెచ్ డీ కుమారస్వామి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. అనంతరం, జేడీఎస్ ఎన్డీయేలో చేరినట్టు జేపీ నడ్డా ఎక్స్‌లో పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: కర్ణాటక జనతా దళ్ సెక్యూలర్ పార్టీ ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్‌లో చేరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోషల్ మీడియా ఎక్స్‌లో వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో తాను జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామిని కలిసినట్టు వివరించారు. ఎన్డీఏలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకోవడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోకి తాము జేడీఎస్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వారి చేరికతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్‌ను పరిపుష్టం చేయడానికి, పటిష్టమైన దేశ నిర్మాణంలో మరింత సులువు అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
హెచ్ డీ దేవేగౌడ, హెచ్ డీ కుమారస్వామి ఇద్దరూ పార్లమెంటులో అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసిన మరుసటి రోజే ఈ నిర్ణయం బయటికి వచ్చింది. కర్ణాటకలో 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తు గురించి వీరు చర్చించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తున్నదని కర్ణాటక బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప పేర్కొన్నప్పుడు తొలిసారిగా ఈ రెండు పార్టీల పొత్తు గురించి చర్చ జరిగింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. అప్పుడు కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది. హెచ్ డీ కుమారస్వామి సారథ్యంలో ఆ ప్రభుత్వం ఉన్నది.
Also Read: భారత్ - కెనడా ఉద్రిక్తతలు .. ఇండియాను వీడనున్న కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆలివర్ సిల్వెస్టర్ ..?
ఇటీవలే జేడీఎస్, బీజేపీ కలవనున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు కర్ణాటకలోని మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాల్లో జేడీఎస్ నాలుగు చోట్ల పోటీ చేస్తుందని, మిగిలిన చోట్ల బీజేపీ పోటీ చేయడానికి నిర్ణయం జరిగినట్టు కథనాలు వచ్చాయి.