మధ్యప్రదేశ్ లో ఈఓడబ్ల్యూ సోదాల్లో ఓ క్లర్క్ ఇంట్లో రూ.85లక్షలు పట్టబడ్డాయి. అయితే ఆ క్లర్క్ తనను ప్రశ్నిస్తున్న అధికారులను నెట్టివేసి.. విషం తాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భోపాల్ : మధ్యప్రదేశ్ లో ఆర్థిక నేరాలు పెచ్చుమీరి పోతున్నాయి. ఈ క్రమంలో భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వ క్లర్క్ మీద ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు రావడంతో.. మధ్యప్రదేశ్ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఈ ఫిర్యాదుపై విచారణ జరిపింది. సదరు రాష్ట్ర ప్రభుత్వ క్లర్క్ ఇంటి మీద సోదాలు చేయగా.. రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ సోదాలు జరుగుతున్నప్పుడు క్లర్క్ విషం తాగాడు. ఈ మేరకు బుధవారం ఒక అధికారి తెలిపారు.
వివరాల్లో వెడితే.. రాష్ట్ర వైద్య విద్యా శాఖకు అనుబంధంగా ఉన్న అప్పర్ డివిజన్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు హీరో కేశ్వాని, అతని జీతం నెలకు దాదాపు రూ. 50,000. అతని మీద ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించగా, EOW అధికారులకు కోట్లాది రూపాయల విలువైన పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సోదాలు బుధవారం అర్థరాత్రి వరకు కొనసాగాయి. ఇక బైరాగఢ్ ప్రాంతంలో ఉన్న అతని ఇంట్లో దొరికిన నగదు కుప్పను లెక్కించడానికి.. నోట్ల లెక్కింపు యంత్రాన్ని తీసుకువచ్చినట్లు అధికారి తెలిపారు.
ఈఓడబ్ల్యూ అధికారులు సోదాల కోసం కేశ్వాని ఇంటికి వెళ్లినప్పుడు.. వారు తన ఇంటిని సోదాలు చేయకుండా ఆపడానికి కేశ్వాని చాలా ప్రయత్నించాడు. వారిని నెట్టివేశాడు. వారు ఇంట్లోకి రావడంతో బాత్రూం క్లీనర్ ను తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (EOW) రాజేష్ మిశ్రా తెలిపారు. "అతడిని వెంటనే ప్రభుత్వ హమీడియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం అతనికి కొంచెం బీపీ సమస్యలు ఉన్నాయి కానీ.. దానికి చికిత్స జరుగుతుంది" అని పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.
సాయంత్రం నాటికి, కేశ్వాని నివాసంలో స్థిరాస్తులు, కోట్లాది రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ. 85 లక్షలకు పైగా నగదు లభించిందని మిశ్రా చెప్పారు. ఆయనకు నాలుగు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆయన ఇల్లు చాలా ఖరీదయ్యిందని, ఇంట్లో ఎటు చూసినా ఖరీదైన అలంకార వస్తువులు ఉన్నాయని.. వాటి విలువ సుమారు రూ. 1.5 కోట్లు అని ఈఓడబ్ల్యూ అధికారి తెలిపారు.
సదరు క్లర్క్ నెలకు రూ. 4,000 జీతంతో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడని, ప్రస్తుతం నెలకు రూ. 50,000 డ్రా చేస్తున్నాడని పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు. కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన తన భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. సోదాల సమయంలో బయటపడ్డ ఆస్తుల మొత్తం విలువ మదింపు పనులు, పత్రాల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే తెలుస్తుందని మిశ్రా తెలిపారు.
