జార్ఖండ్‌లో ఓ ఏనుగు తన గుంపు నుంచి తప్పిపోయి ప్రజలపై ఆగ్రహం ప్రదర్శిస్తోంది. గడిచిన 12 రోజుల్లో 16 మందిని హతమార్చింది. దీంతో ప్రజలు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో అధికారులు 144 సెక్షన్ విధించారు.
జార్ఖండ్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. గడిచిన 12 రోజుల్లో 16 మందిని పొట్టనబెట్టుకుంది. రాంచీ జిల్లాలోని ఇట్కీ బ్లాక్ లో మంగళవారం ఒకే రోజు నలుగురిని హతమార్చింది. దీంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని ప్రజలు ఆ గజరాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అసాధారణ ఘటనకు పాల్పడిన అడవి ఏనుగు నుంచి ఆయా గ్రామస్తులను దూరంగా ఉంచడానికి ఇట్కీ బ్లాక్‌లో సీఆర్ పీసీ సెక్షన్ 144 కింద రాంచీ జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసింది.
అటవీ అధికారుల ప్రకారం.. ఏనుగు తన మంద నుండి విడిపోయిన 12 రోజుల్లో జార్ఖండ్‌లోని ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు 16 మందికి పైగా ప్రాణాలను తీసింది. హజారీబాగ్, రామ్‌గఢ్, ఛత్రా, లోహర్దగా మరియు రాంచీ జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. సోమవారం లోహర్దగాలో ఏనుగు ఐదుగురిని చంపింది. వీరిలో ముగ్గురు భాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఉదయం చనిపోగా.. కుడులో అడవి ఏనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది.
రాంచీలోని ఇట్కీ బ్లాక్‌లో ఒంటరి ఏనుగును పట్టుకోవాలనే ఉద్దేశంతో సమీపంలో ప్రజలు గుమిగూడుతున్నట్టు వార్తలు రావడంతో సదర్ సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్ డీవో) ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. “రాంచీలోని ఇట్కీ బ్లాక్ లో మానవ-జంతు సంఘర్షణ వల్ల సంభవించే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికీ, ఇట్కీ బ్లాక్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించామని, అడవి ఏనుగు దగ్గర గ్రామస్తులు గుమిగూడి దానిని బయటకు లాగే అవకాశాలను తోసిపుచ్చలేము’’ అని సదర్ (ఎస్డీఓ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
శివసేన పేరు, గుర్తు వివాదం : షిండేకు ఊరట, ఉద్ధవ్‌కు అక్కడా నిరాశే.. ఈసీ ఆదేశాలపై స్టేకు సుప్రీం నో
ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకే చోట ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడాన్ని నిషేధించారు. ఇదిలా ఉండగా అడవి ఏనుగుల నుంచి ప్రజలకు దూరంగా ఉండాలని అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు దాని మంద నుంచి విడిపోవడమే ఈ హింసకు ప్రధాన కారణం. అది ప్రస్తుతం చిరాకుగా ఉంది. ఒంటరి ఏనుగులకు దూరంగా ఉండాలి. అది ఒక నిర్దిష్ట దిశలో కదులుతుంటే దాని వైపు వెళ్లకుండా ప్రయత్నించాలి’’ అని పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) శస్కియార్ సమంత అన్నారు.
చిరాకు పడిన తర్వాతే ప్రజలపై దాడి చేస్తుందని, తనకు అడ్డుగా వచ్చేవారిని చంపేస్తుందని ఆయన అన్నారు. తాము దాని స్థానాన్ని నిరంతరం ట్రాక్ చేస్తున్నామని, దానిని వేరు చేసిన మంద వైపు లాగడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు అవసరమైతే ఇతర రాష్ట్రాల సాయం కూడా తీసుకుంటామన్నారు.
జార్ఖండ్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. ఐఈడీ పేల్చడంతో కట్టెలు సేకరించేందుకు వెళ్లిన యువకుడు మృతి
ఉత్తర భారతదేశంలో జార్ఖండ్ ఏనుగులకు హాట్ స్పాట్ గా ఉంది. కానీ గత దశాబ్దంలో క్రమబద్ధీకరించని, అక్రమ మైనింగ్ పెరగడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అంతేకాక బొగ్గు గనుల ప్రాజెక్టులు ఏనుగుల సహజ కారిడార్ ను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. వీటి వల్ల అటవీ ప్రాంతాల నుంచి అడవి ఏనుగులను మానవ జనావాసాల వైపు వెళ్తున్నాయి. దీని వల్ల మానవ-జంతు సంఘర్షణకు అవకాశం పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం 2021-22లో అడవి ఏనుగుల దాడిలో 133 మంది చనిపోగా, 2020-21లో 84 మంది మరణించారు.
