అభివృద్ధి, అభ్యుదయ రాజకీయాలకే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఓటు వేశారని అన్నారు బీజేపీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ . ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బీజేపీ సత్తా చాడటంపై ఆయన హర్షం  వ్యక్తం చేశారు. 

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (five state electon results) బీజేపీ (bjp) దూసుకెళ్తోంది. పంజాబ్‌లో (punjab)ఎలాంటి ప్రభావం చూపించనప్పటికీ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) స్పందించారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్న, అమలు చేస్తోన్న కొత్త తరహా పాలన, రాజకీయాలకు ఈ ఎన్నికల ఫలితాలే ఆమోదంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. 

2014, 2017, 2019, 2022లలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రధాని మోడీకి విజయం కట్టబెట్టారని రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి, అభ్యుదయ రాజకీయాలకు యూపీ ప్రజలు ఓటు వేశారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ తరహా పరిస్దితిని ఉత్తరప్రదేశ్ గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. సుపరిపాలనకు, అవినీతి లేకుండా ప్రజా పథకాలను అమలు చేయడం, శాంతి భద్రతలు, పౌరులందరికీ భద్రత కల్పించడం వంటి అంశాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ గుర్తులైన ఆరు దశాబ్ధాల రాజవంశానికి, అవినీతి, మాఫియా, మధ్యవర్తిత్వ రాజకీయాలకు యూపీ ప్రజలు చరమ గీతం పాడారని ఆయన అభివర్ణించారు. 

కాగా.. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కార్ మరోసారి విజయ ఢంకా మోగించింది. ఈ రోజు ఉదయం (UP Election results 2022) నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో భారీ లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 250కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ 202ను దాటేసింది. దీంతో మరోసారి యోగి సీఎం పీఠంపై కూర్చొబోతున్నారు. దీంతో 37ఏళ్ల తర్వాత బీజేపీ ఓ అరుదైన ఫీట్‌ను అందుకోనుంది. 

1985 తర్వాత యూపీలో ఏ సీఎం మళ్లీ ఎన్నిక కాలేదు. 1985 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ 269 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా నారయణ్ దత్ తివారీ ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 309 సీట్లు గెలుచుకుని సీఎం పీఠం దక్కించుకుంది. ఇప్పుడు ఇలా వరుసగా రెండుసార్లు(2017, 2022) సీఎం కావడం యోగికే దక్కింది.

కాగా.. యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగింద‌ని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం త‌మ‌దైన త‌ర‌హాలో ప్ర‌చారం సాగిస్తూ.. ఎన్నిక‌ల బ‌రిలో ముందుకుసాగాయి. మొద‌టి విడుతలో 58 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌గా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ న‌మోదైంది. 2017 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ( 63.5 శాతం) త‌క్కువ‌గా ఉంది.