ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ కోసం 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు.. 19,000 మంది హోంగార్డులు, 42 వేల మంది స్థానిక పోలీసులను మోహరించారు.

Also Read:ఎన్నికలకు కొద్ది గంటల ముందు.. కేజ్రీవాల్‌కు ఈసీ షాక్

మొత్తం 68,000 వేల సిబ్బంది పోలింగ్ విధుల్లో పాలు పంచుకోనున్నారు. షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను సున్నిత ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది.

మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది. మూడు పార్టీల నుంచి 668 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 13,750 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 

Also Read:డిప్యూటీ సీఎం సిసోడియా ఒఎస్డీని అరెస్టు చేసిన సీబీఐ

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఎన్నికల కమీషన్ షాకిచ్చింది. ఆయన ట్విట్టర్‌ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియోపై కమీషన్ మండిపడింది.

ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడమేనని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు జారీ చేసింది. ఆ వీడియో మోడల్ కోడ్, ఆర్పీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, ఓట్లు సాధించడం కోసం కుల, మత భావాలను రెచ్చగొట్టడంతో పాటు మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని ఈసీ అభిప్రాయపడింది.