ముస్లిం అభ్యర్థులు ఓటు వేయవద్దని బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ కొత్త వివాదాన్ని రాజేశారు. బీజాపూర్‌లో భవిష్యత్‌లోనైనా పొరపాటుగా కూడా ముస్లిం అభ్యర్థికి ఓటు వేయవద్దని అన్నారు. 

బెంగళూరు: కర్ణాటకలో టిప్పు సుల్తాన్ గురించిన చర్చ ఎన్నికలు పూర్తయ్యే దాకా ముగిసేలా లేదు. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే మరోసారి టిప్పు సుల్తాన్ ప్రస్తావన తెచ్చారు. ఈ సారి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. బీజాపూర్ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాలు మాట్లాడుతూ ముస్లిం అభ్యర్థులకు అసలు ఓటే వేయవద్దని చెప్పారు.

‘ఎమ్మెల్యేలు అందరూ నన్ను అడుగుతారు.. నీ నియోజకవర్గంలో సుమారు లక్ష మంది టిప్పు సుల్తాన్‌లు ఉన్నారు. కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడివైన నీవు ఎలా బీజాపూర్‌లో గెలిచావు? అని అడుగుతారు. భవిష్యత్‌లో టిప్పు సుల్తాన అభిమానులు ఎవరూ బీజాపూర్ నుంచి గెలవడానికి వీల్లేదు. కేవలం శివాజీ మహారాజ్ వారసులు మాత్రమే గెలవాలి. అంతేనా? కాదా? మీరు ముస్లిం అభ్యర్థులకు పొరపాటున కూడా ఓటేయరాదు’ అని కొత్త వివాదానికి తెర తీశారు. 

Also Read: త్వరలో 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు: బండి సంజయ్

బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రంలోకి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు తేవడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే అన్నారు. ‘మనం కన్నడిగులం. మనం అభ్యుదయ రాజకీయాలు చేయాలి. మీరు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి ఓట్లు పొందండి’ అని సూచనలు చేశారు.