2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ కోర్టును ఆశ్రయించి తనను జైలు నుంచి బయటకు తీసుకెళ్లరాదని కోరాడు. కోర్టు విచారణ కోసం లేదా జైలు బదలాయించడం కోసం బయటకు తీసుకెళ్లితే మార్గం మధ్యలోనే తనను చంపేసే ముప్పు ఉన్నదని తెలిపాడు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భయానక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉమేశ్ పాల్ హత్య తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితులు సున్నితంగా మారాయి. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ హత్య తర్వాత కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ల పేర్లు ఎక్కువగా వార్తల్లో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడైన అష్రఫ్ కోర్టును ఆశ్రయించి తనను జైలు నుంచి బయటకు తీసుకెళ్లవద్దని వేడుకున్నాడు. తనకు ప్రాణ హాని ఉన్నదని విన్నవించుకున్నాడు. అంతేకాదు, జైలు ప్రాంగణంలోనూ సెక్యూరిటీ పెంచాలని కోరాడు.
బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ 2005లో హత్యకు గురయ్యాడు. అలహాబాద్ (వెస్ట్) సీటు నుంచి గెలిచిన నెలల వ్యవధిలోనే ఆయన హత్యకు గురయ్యాడు. మాజీ ఎంపీ, గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చిన్న తమ్ముడు ఖాలిద్ ఆజీమ్ పై బీఎస్పీ టికెట్ పై రాజు పాల్ గెలిచాడు.
రాజు పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ సహా ఇతర నిందితులు అంతా జైళ్లలోనే ఉన్నారు. అతిక్ అహ్మద్ గుజరాత్‌లో సబర్మతి జైలులో ఉండగా.. అష్రఫ్ మాత్రం బరేలీ జైలులో ఉన్నాడు.
రాజు పాల్ హత్య కేసులో ప్రధాన విట్నెస్ ఉమేశ్ పాల్ ఇదే నెలలో ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే ఇంటికి సమీపంలో రోడ్డుపైనే దారుణ హత్యకు గురయ్యాడు. తన హ్యుందాయ్ క్రెటా ఎస్ యూ వీ కారు వెనుక సీటు నుంచి ఉమేశ్ పాల్ దిగుతూ ఉండగా.. కొందరు దుండగులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపారు. అతనికి సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గార్డులూ బుల్లెట్లతో తీవ్రంగా గాయపడ్డారు. ఉమేశ్ పాల్‌ను స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఉమేశ్ పాల్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి ఆ దుండగులు పారిపోయారు.
ఈ కాల్పులకు తెగబడ్డ వారి వెహికిల్‌ను నడిపినట్టుగా అర్బాజ్ అనే నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఉమేశ్ పాల్ హత్య కేసులో అర్బాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్ దగ్గర సోమవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అర్బాజ్ మరణించాడు. యూపీ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎన్‌కౌంటర్‌లో అర్బాజ్ మరణించాడు.
ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ కోర్టును ఆశ్రయించాడు. తనను కోర్టులో విచారణ కోసం బరేలీ జైలు నుంచి బయటకు తీసుకురావొద్దని, లేదా వేరే జైలుకూ బదలాయించవద్దని కోరాడు. మార్గం మధ్యలోనే తనను చంపేసే ముప్పు ఉన్నదని వివరించాడు. జైలు ప్రాంగణంలోనూ సెక్యూరిటీని కోరాడు.
అతీక్ అహ్మద్ సూచనల మేరకు బరేలీ జైలులోనే ఉమేశ్ పాల్ హత్యకు పథకం రచించారని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది. అష్రఫ్‌ను ఆ దుండగులు కలిసిన తర్వాతే ప్లాన్ చేశారని కొన్ని వర్గాలు చెప్పినట్టు తెలిపింది.
