గంజాయి అమ్ముతున్న డాగ్ ట్రైనర్.. పట్టుబడకుండా పోలీసు దుస్తుల్లో కనిపిస్తే దాడిచేసేలా కుక్కలకు ట్రైనింగ్..
కుక్కల పెంపకకేంద్రం నడుపుతూ.. గంజాయి అమ్ముతున్నాడో వ్యక్తి. అంతేకాదు పోలీసు దుస్తుల్లో కనిపిస్తే దాడిచేసేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు.

కేరళ : డ్రగ్స్ పెడ్లర్స్ రోజురోజుకూ కొత్త కొత్త పద్ధతులను కనిపెడుతున్నారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని వింటే ఔరా అని ముక్కున వేలేసుకుంటారు. ఓ వ్యక్తి పెంపుడు కుక్కలకు ట్రైనింగ్ ఇస్తాడు. పనిలో పనిగా గంజాయి కూడా అమ్ముతుంటాడు. అంతేనా.. గంజాయి అమ్మకంలో దొరకకుండా ఉండడం కోసం.. పోలీసు దుస్తుల్లో ఎవరైనా కనిపిస్తే చాలు రెచ్చిపోయి, మీదపడేలా.. కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెడితే...
కొట్టాయం జిల్లాలో కుక్కల పెంపకం కేంద్రంపై పోలీసులు దాడి చేసి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'డెల్టా కె9' పేరుతో నడుపుతున్న ఈ కేంద్రం వాస్తవానికి గంజాయిని విక్రయించడంలో ముందుంది. పక్కాసమాచారంతో దాడి చేసిన పోలీసుల నుంచి.. గంజాయిని విక్రయించే కుక్కల పెంపకందారుడు, రాబిన్ జార్జ్ తప్పించుకున్నాడు.
సీనియర్ నటి వహీదా రెహ్మాన్ కు ప్రతిష్టాత్మక పురస్కారం.. వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కానీ అతను ట్రైనింగ్ ఇచ్చిన కుక్కల గుంపునుంచి తప్పించుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఎలాగో చావుతప్పి కన్నులొట్టపోయి పోలీసు అధికారులు క్షేమంగా బయటపడ్డారు, అయితే కుక్కలను అదుపులోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేంద్రంలో పిట్‌బుల్స్, రోట్‌వీలర్స్‌తో సహా దాదాపు 13 భయంకరమైన కుక్కలు ఉన్నాయి.
ఈ కుక్కలన్నీ "ఖాకీ దుస్తులు ధరించిన వారి మీద అటాక్ చేయడానికి శిక్షణ పొందాయి" అని కొట్టాయం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), కె కార్తీక్ తెలిపారు. రాబిన్ ఆ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, కుక్కల శిక్షణ ఇచ్చేవాడు. "కుక్కల యజమానులు బైటి ఊర్లకు వెళ్లేప్పుడు వారి కుక్కలను అతనితో (రాబిన్) విడిచిపెట్టేవారు. అతను రోజుకు రూ. 1,000 వసూలు చేసేవాడు. కుక్కలను చూసుకునేవాడు" అని ఎస్పీ చెప్పారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.