సీనియర్ నటి వహీదా రెహ్మాన్ కు ప్రతిష్టాత్మక పురస్కారం.. వరించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ హిందీ నటి వహీదా రెహ్మాన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు - 2023 అందజేయనున్నట్టు ప్రకటించింది. భారతీయ చలన చిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందజేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

ప్రముఖ సీనియర్ నటి వహీదా రెహమాన్ కు ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు సీనియర్ నటి వహీదా రెహ్మాన్ ను ఎంపిక చేశామని ఆయన ప్రకటించారు.
ఠాకూర్ ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. ‘‘భారతీయ సినిమాకు వహీదా రెహమాన్ చేసిన సేవలకు గాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే జీవిత సాఫల్య పురస్కారం లభించిందని ప్రకటించడం ఎంతో సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను. హిందీ చిత్రాల్లో నటించిన వహీదా విమర్శకుల ప్రశంసలు పొందారు, వాటిలో ముఖ్యమైనవి, ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌధవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, ఖామోషి మరెన్నో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
5 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరీర్ లో అత్యంత గొప్ప పాత్రలను పోషించారని అనురాగ్ ఠాకూర్ కొనియాడారు. ‘రేష్మా ఔర్ షేరా’ చిత్రంలో కులవధు పాత్రకు జాతీయ చలనచిత్ర పురస్కారం లభించిందని ఆయన అన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన వహీదా తన కృషితో అత్యున్నత స్థాయి వృత్తిపరమైన నైపుణ్యాన్ని సాధించగల భారతీయ మహిళ అంకితభావం, నిబద్ధత, బలానికి ఉదాహరణగా నిలిచారని గుర్తు చేశారు.
చారిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియం పార్లమెంటు ఆమోదం పొందిన సమయంలో వహీదా రెహ్మాన్ కు ఈ జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం భారతీయ చలనచిత్ర రంగంలోని ప్రముఖ నటీమణులలో ఒకరికి, దాతృత్వానికి, సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తికి తగిన నివాళి అని ఆయన అన్నారు. మన సినీ చరిత్రలో అంతర్భాగమైన ఆమె గొప్ప కృషికి అభినందనలు, నమస్కరాలు అని అన్నారు.
1938 ఫిబ్రవరి 3న జన్మించిన వహీదా రెహ్మాన్ తన కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలను అందించారు. హిందీ సినిమా రంగానికి చేసిన అపురూపమైన సేవలకు గాను ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. భారత ప్రభుత్వం 1972లో వాహీదాను పద్మశ్రీతో సత్కరించింది. 2011లో కూడా ఆమెకు పద్మభూషణ్ అవార్డు వరించింది. వహీదా రెహమాన్ చివరిసారిగా 2021లో విడుదలైన ఇండియన్-అమెరికన్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్పోర్ట్స్ డ్రామా 'స్కేటర్ గర్ల్'లో కనిపించారు.