మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులెవరో తెలుసా..?
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పీఠం అధిరోహించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9న జరగనుండగా... పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఎవరెవరు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నారంటే...
మూడోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇప్పటికే నిర్వహించిన ఎన్‌డీయే మిత్రపక్ష నేతల సమావేశంలో ప్రధాని మోదీని కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బిహార్ సిఎం, జేడీయూ పార్టీ ఛీఫ్ నితీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇతర మిత్రపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్‌డీయే నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఎన్‌డీయే తరఫున అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీశ్ కుమార్, ఎక్‌నాథ్ షిండే తదితరులు ఈ ప్రతిపాదనను సమర్థించారు.
మూడోసారి ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తం ఖాయమైన నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగున ఉన్న దేశాధినేతలను ఆహ్వానించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే వస్తామని సమాచారం ఇచ్చారట. వారితో పాటు నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషష్ దేశాధినేతలకు కూడా భారత్ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ముందుగా శనివారమే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆదివారానికి వాయిదా పడింది.