Ayodhya: రామ మందిరం ఓపెనింగ్ రోజున అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోడీ విజ్ఞప్తి
రామ మందిర ప్రారంభ మహోత్సవం నాడు ప్రజలు అయోధ్యకు రావొద్దని ప్రధానమంత్రి మోడీ సూచనలు చేశారు. మరుసటి రోజు నుంచి రామ మందిరం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని, భక్తులు రామ మందిరాన్ని సందర్శించవచ్చునని తెలిపారు.
Ram Temple: జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అయోధ్య నగరం రూపురేఖలే మారిపోతున్నాయి. సరికొత్తగా రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్, కొత్త ఎయిర్‌పోర్టు, వీధులన్నీ చక్కబడటం, ప్రయాణ సదుపాయాలు, హోటళ్ల ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. జనవరి 22వ తేదీనాటి మహోత్సవం కోసం సర్వం సిద్ధం అవుతున్నది. లక్షలాది మంది ఈ కార్యక్రమం కోసం అయోధ్యకు తరలివస్తారని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు.
ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రజలు అయోధ్యకు వస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. మౌలిక సదుపాయాలే కాదు.. వచ్చిన భక్తులకూ ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ ప్రజలకు ఓ సూచన చేశారు. భక్తులంతా మూకుమ్మడిగా జనవరి 22వ తేదీనే రావాల్సిన అవసరం లేదని, 23వ తేదీ నుంచి రామ మందిరం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని తెలిపారు. కాబట్టి, 23వ తేదీ నుంచి అయోధ్యకు ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవడం మంచిదని సూచించారు. జనవరి 22వ తేదీన అయోధ్యకు రావాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దే ఉండి ఆ రోజు ఇంట్లో ద్వీప ప్రజ్వలనం చేసుకోవాలని సూచనలు చేశారు. ‘భక్తులుగా మనం రాముడికి ఇబ్బంది కలిగించవద్దు. 23వ తేదీ తర్వాత మరెప్పుడైనా మీరు ఇక్కడికి రావొచ్చు. రామ మందిరం ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోతుంది’ అని శనివారం వివరించారు.
Also Read: TDP: ఏపీలో తెలంగాణ ట్రెండ్.. చంద్రబాబు, పవన్ రెండు స్థానాల్లో పోటీ? అల్లుడి కోసం సీటు త్యాగం!
టెంటు కింద గడిపిన రాముడికి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని, రామ్ లల్లాతోపాటు దేశంలోని సుమారు నాలుగు కోట్ల మంది పేద ప్రజలకూ గృహాలు నిర్మించామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు అయోధ్యలో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, మహార్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇదే రోజున ఎనిమిది కొత్త ట్రైన్ రూట్లను ప్రారంభించారు.