పార్లమెంటులో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ప్రధాని మోడీ 10వ తేదీన సమాధానం ఇవ్వనున్నారు. ఈ మేరకు బీఏసీ మీటింగ్‌లో నిర్ణయాలు జరిగాయి. ఈ మీటింగ్ నుంచి కూడా ప్రతిపక్షాలు వాకౌంట్ చేశాయి. 

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమి ఇండియా పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఈ తీర్మానంపై లోక్ సభలో చర్చ మొదలు కానుంది. మూడు రోజులపాటు అంటే 10వ తేదీ వరకు ఈ చర్చ సాగుతుంది. చివరి రోజున అంటే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. లోక్ సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నిర్ణయాలు జరిగాయని ఓ నేత చెప్పారు.

బీఏసీ మీటింగ్ నుంచి కూడా ఇండియా కూటమి నేతలు వాకౌట్ చేయడం గమనార్హం. అవిశ్వాస తీర్మానానికి ప్రాధాన్యత ఇచ్చి తక్షణమే జరప లేదని నిరసనగా ఈ ఎంపీలు వాకౌట్ చేశారు. అవిశ్వాస తీర్మానంపై బుధవారం చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. ఇంతలో కొన్ని బిల్లులనూ పాస్ చేయించుకుంది. అయితే.. అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉండగా బిల్లులు పాస్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇండియా నేతలు అన్నారు.

Also Read: ఒకే వేదికపై శరద్ పవార్, ప్రధాని మోడీ.. ఆత్మీయ పలకరింపు, విపక్ష కూటమిలో ఆందోళన

మణిపూర్ హింసపై పార్లమెంటులో చర్చ చేయాలని, అందుకు తగిన సమయం కేటాయించాలని, అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా పార్లమెంటులో ఈ విషయమై ఆందోళనలు చేశారు. 16వ లోక్ సభ(2014 నుంచి 2019 వరకు ఉన్న లోక్ సభ)లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా మరుసటి రోజే చర్చ జరిపారని లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం ఖాతరు చేయలేదని, అందుకే నిరసనగా వాకౌట్ చేసినట్టు ఎంపీ టీఆర్ బాలు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మణిపూర్ రాష్ట్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. మణిపూర్ గవర్నర్ అనుసూయి యూకిని కలిశారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మెమోరాండం సమర్పించారు. అదే విధంగా మణిపూర హింసపై చర్చించడానికి ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్‌ను కూడా కోరారు. అందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు విపక్ష ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. ఉదయం 11.30 గంటలకు కలవాలని ఆమె ఇండియా కూటమి ఎంపీలకు సూచనలు చేశారు.