కరడుగట్టిన ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్ధాపకుడు, దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు సూత్రధారి యాసీన్ భత్కల్ అలిగాడు. తమకు ఇండక్షన్ కుక్కర్లు ఇవ్వాలని కోరుతూ మరికొందరు నేరగాళ్లతో కలిసి నిరాహారదీక్షకు దిగాడు.

దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో 149 మందిని పొట్టనపెట్టుకున్న యాసిన్ భత్కల్‌‌ సహా మరికొందరు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల కేసులకు సంబంధించి విచారణ జరుగుతుండటంతో ఇతనిని ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు.

అయితే గతేడాది శీతాకాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ఖైదీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారికి పాలు, నీళ్లు వేడి చేసుకునేందుకు కొన్ని బ్లాకుల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే ఎండాకాలం కావడంతో అధికారులు వాటిని తిరిగి తీసుకున్నారు. యాసీన్‌కు అధికారుల నిర్ణయం నచ్చలేదు. ఆ కుక్కర్లను తమకు శాశ్వతంగా ఇచ్చివేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగాడు.

దీనికి అధికారులు ససేమిరా అనడంతో మరికొందరు ఉగ్రవాదులతో కలిసి రెండు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగాడు. జైలు అధికారులు నచ్చజెప్పడంతో అతను ఎట్టకేలకు మనసు మార్చుకున్నాడు.