Dharmasthala Mass Burial Case: కర్ణాటకలోని 'ధర్మస్థల' కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు వందలాది మృతదేహాలను తాను పాతిపెట్టానని చెప్పుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుడు, తాను ఒత్తిడితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని స్పష్టంచేశారు.
Dharmasthala Mass Burial Case: కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రా క్షేత్రం 'ధర్మస్థల' ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని, వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏఏ ప్రాంతాల్లో అతడు మృతదేహాలను పూడ్చాడనే విషయాల ఆధారంగా ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్నాయి. తాను చెప్పిన 13 ప్రదేశాలలో.. ఒక్కచోటే 70-80 మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేసినట్లు పేర్కొన్నాడు. కానీ, తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కసారిగా మాట మార్చాడు.
'ధర్మస్థల' కేసులో వందలాది మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించి సంచలనం రేపిన పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. తాను కొంత మంది బలవంతంపై ఈ ప్రకటన చేశానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ముందు హాజరైన ఆయన, తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చానని సంచలన ఆరోపణలు చేశారు.
SIT ముందు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం
SIT అధికారులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌లో ఆ వ్యక్తి ఇలా పేర్కొన్నారు. తాను ప్రస్తుతం తమిళనాడులో స్థిరపడ్డాననీ, 2014లోనే ధర్మస్థలాన్ని వదిలిపోయానని తెలిపారు. అప్పటి నుంచి తమిళనాడులోనే నివసిస్తున్నానని అన్నారు. 2023లో ఒక గ్యాంగ్ తననీ సంప్రదించారనీ, తనపై బెదిరించారని తెలిపారు. తాను మృతదేహాలను చట్టబద్ధంగానే పాతిపెట్టానని చెప్పినా, వారు SIT ముందు లొంగిపోవాలని తనని బలవంతం చేశారని వివరించారు.
అస్థిపంజరం ఇచ్చి బలవంతం చేశారనీ, ఆ గ్యాంగ్ తనకి ఒక పుర్రె ఇచ్చి, దాన్ని పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేసిందనీ, వారి మాట విని SIT ముందు హాజరయ్యానని తెలిపారు. పోలీసుల ముందు ఏమి చెప్పాలో ఆ ముగ్గురు తనకి చెప్పాలో కూడా నేర్పించారనీ, వారి ఒత్తిడితోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బయట పెట్టడానికి తాను చాలా కాలం భయపడ్డాననీ, కానీ సుజాత భట్ ఫిర్యాదు చేసిన తర్వాత తనకి ధైర్యం వచ్చిందనీ, అప్పుడు నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.
SIT దర్యాప్తులో కొత్త మలుపు
ఈ సంచలన ప్రకటన తర్వాత SIT అధికారులు ఫిర్యాదుదారుడి పూర్తి వీడియో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. కేసు దర్యాప్తులో ఈ ప్రకటన కీలక ఆధారంగా మారే అవకాశముంది. అధికారులు ఇప్పుడు నయా గ్యాంగ్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించారు. దీంతో ధర్మస్థల కేసు మరింత క్లిష్టతరం అయింది. ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలం ఆధారంగా SIT ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో కేసు రహస్యాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి.
రాజకీయ దూమారం
ధర్మస్థలంలో మృతదేహాల ఖననంపై రాజకీయ దుమారం తీవ్రమైంది. కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ధర్మస్థలం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనీ, భక్తులు భయంతో ఉన్నారని బిజెపి నేతలు ప్రభుత్వంపై విమర్శులు గుప్పిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర నేతృత్వంలోని బిజెపి ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే ధర్మస్థలాన్ని సందర్శించి దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేతో సమావేశమై చర్చలు జరిపింది.
ఇదిలా ఉండగా, ధర్మస్థలపై జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉందని అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ ఘటన బీజేపీ నాయకులకు ఆయుధంగా మారిందని అన్నారు. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు.
