26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడుల్లో ప్రాణాలతో బయటపడిన అతి పిన్న వయస్కురాలైన దేవికా రోటవాన్.. 17 ఏళ్ల తర్వాత పాక్ నుంచి జవాబుదారీతనం, న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ లెక్క ఇంకా సరిపోలేదు.. అసలైన న్యాయం జరగాల్సిందేనన్నారు.

26/11 Mumbai Attacks: నవంబర్ 26, 2008న లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST) రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్ సహా ఇతర బహిరంగ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు జరిపిన కాల్పుల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

ఆ రాత్రి సీఎస్టీ స్టేషన్‌లో ఉన్న వేలాది మందిలో తొమ్మిదేళ్ల చిన్నారి దేవికా రొటావన్ కూడా ఉన్నారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. ఈ ఘటన జరిగి పదిహేడేళ్లు గడిచిన సందర్భంగా, దేవికా ఆసియానెట్ న్యూస్ తో మాట్లాడుతూ నాటి భయానక క్షణాలు, తన ధైర్యం, తన కుటుంబం చేసిన సుదీర్ఘ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.

పాకిస్థాన్ ఇంకా ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించుకోలేదనీ, పూర్తి న్యాయం జరగాల్సి ఉందని అన్నారు. 

26/11 Mumbai Attacks: ఆ భయానక రాత్రి జ్ఞాపకాలు

ఆ రోజు రాత్రి జరిగిన గందరగోళం, భీభత్సాన్ని దేవికా స్పష్టంగా గుర్తు చేసుకున్నారు. "ఆ రాత్రి నేను చాలా భయపడ్డాను. అప్పుడు నాకు కేవలం తొమ్మిదేళ్ల పదకొండు నెలలు మాత్రమే. ఆ వయసులో ఉగ్రవాదం అంటే ఏమిటో నాకు తెలియదు. మాకు టెర్రరిజం గురించి గానీ, బుల్లెట్లు పేల్చడం గురించి గానీ అవగాహన లేదు" అని ఆమె తెలిపారు. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదిని చూసిన క్షణాలను ఆమె వివరించారు.

"కసబ్ చేతిలో పెద్ద తుపాకీ ఉంది. ప్రజలను చంపడం ద్వారా అతడు ఆనందాన్ని పొందుతున్నట్లు అనిపించింది. ఆ చిన్న వయసులో నేను చూసిన ఆ దృశ్యం ఇప్పటికీ నా మనసులో అలాగే ముద్రించుకుపోయింది. నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను, మర్చిపోవాలనుకున్నా అది సాధ్యం కాదు" అని దేవికా ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఆ రాత్రి కలిగిన భయం చివరికి తనలో మనోధైర్యంగా మారిందని ఆమె చెప్పారు. "ఆ రాత్రి కలిగిన భయం, ఆ బాధ నాకు చాలా భిన్నమైనవి. ఆ రోజు భయపడినంతగా నేను ఆ తర్వాత ఎప్పుడూ భయపడలేదు. ఆ భయాన్నే నేను నా ధైర్యంగా మార్చుకున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

కుటుంబం, అధికారుల నుంచి వచ్చిన ధైర్యం

అంత చిన్న వయసులో అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడగగా, దేవికా సమాధానమిస్తూ.. "ముందుగా, ఈ విషయంలో నేను నా కుటుంబానికి రుణపడి ఉంటాను. అంతకంటే ముందు ఆర్మీ అధికారులకు, పోలీసు అధికారులందరికీ క్రెడిట్ ఇస్తాను. వారి నుంచే నాకు ఆ స్ఫూర్తి, ధైర్యం లభించాయి" అని తెలిపారు.

ఆమె వ్యక్తిగత జీవితంలోని విషాదాలు ఆ రాత్రి జరిగిన దాడిని మరింత భారంగా మార్చాయి. 26/11 దాడులకు ముందే దేవికా తన తల్లిని కోల్పోయారు.

"మొదట అమ్మ మరణం, తర్వాత రెండోది నేను కాల్పుల్లో గాయపడటం, ఆపై ఉగ్రవాదాన్ని కళ్లారా చూడటం.. ఇవన్నీ నాలో ధైర్యాన్ని నింపాయి. ఇంతమందిని పొట్టనబెట్టుకుంటున్న వారిని శిక్షించాలనే కసి నాలో పెరిగింది. అందుకే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె వివరించారు.

యుద్ధభూమిగా మారిన సీఎస్టీ రైల్వే స్టేషన్

తాను, తన తండ్రి, సోదరుడు ప్లాట్‌ఫారమ్ 12-13 వద్ద వేచి ఉన్నప్పుడు హఠాత్తుగా గందరగోళం చెలరేగిందని దేవికా గుర్తుచేసుకున్నారు. "అకస్మాత్తుగా బాంబు పేలింది. ఆ శబ్దం చాలా పెద్దగా వినిపించింది. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. అప్పుడు ప్రజలు తమ బ్యాగులు వదిలేసి పారిపోవడం చూశాం. ఆ వెంటనే కాల్పులు మొదలయ్యాయి" అని తెలిపారు.

ఆమె చూసిన దృశ్యాలు ఇంకా ఆమె కళ్ల ముందే మెదులుతున్నాయి. "కొందరి చేతుల్లోంచి, కొందరి కాళ్లలోంచి, ఇంకొందరి తల, పొట్ట భాగాల నుంచి రక్తం కారుతోంది. సినిమాల్లో కాల్పులు చూస్తాం.. కానీ నిజ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. అది చాలా భయంకరమైన రాత్రి. నా మనసులోంచి ఆ చీకటి రాత్రిని ఎప్పటికీ తీసివేయలేను" అని ఆమె వాపోయారు.

తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలుకు బుల్లెట్ తగిలింది. "నేను మా నాన్న నుంచి దూరంగా పరుగెత్తడానికి ప్రయత్నిస్తుండగా, ఒక బుల్లెట్ నా కాలును తాకింది. అప్పుడే పెద్ద తుపాకీతో ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడం చూశాను. మమ్మల్ని, అందరినీ చంపడాన్ని ఆనందిస్తున్నట్లు అనిపించింది” అని తెలిపారు.

45 రోజుల ఆసుపత్రిలోనే.. ఆరు సర్జరీలు

చికిత్స కోసం దేవికాను రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. "నవంబర్ 26న నాపై కాల్పులు జరిగాయి. నవంబర్ 27న నా కాలు నుంచి బుల్లెట్‌ను తొలగించారు" అని ఆమె చెప్పారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించిందని ఆమె తెలిపారు.

కానీ మానసిక వేదన అంతకంటే ఎక్కువగా ఉంది. "మా నాన్న నాకంటే ముందే సాక్ష్యం చెప్పారు, ఆ తర్వాత నేను చెప్పాను. నేను కావాలనుకుంటే ఇంట్లోనే ఏడుస్తూ కూర్చోగలిగేదాన్ని.. కానీ నా బాధను ధైర్యంగా మార్చుకున్నాను" అని తెలిపారు.

2012 నవంబర్ 21న కసబ్‌ను ఉరితీసిన రోజును ఆమె గుర్తు చేసుకున్నారు. "ఉదయాన్నే నాకు ఒక పోలీస్ అధికారి నుంచి ఫోన్ వచ్చింది. 'బిడ్డా, నువ్వు గెలిచావు!' అని చెప్పారు. కానీ కసబ్ కేవలం ఒక దోమ లాంటివాడని నాకు అనిపించిందని" తెలిపారు.

ఆమె ప్రకారం నిజమైన న్యాయం కసబ్ ఉరితో ఆగిపోదు. "పాకిస్థాన్‌లో ఇంకా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నవారు, కసబ్ లాంటి వారిని తయారు చేసి మద్దతు ఇస్తున్నవారు అంతం అయినప్పుడే నాకు పూర్తి న్యాయం దొరుకుతుంది" అని తెలిపారు.

ఇంటి కోసం 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ

ఈ కేసులో అతి పిన్న వయస్కురాలైన సాక్షిగా ఉన్నప్పటికీ, తన పునరావాస ప్రయోజనాల కోసం దేవికా పోరాడాల్సి వచ్చింది. "నాకు ప్రతిదీ సులభంగా దొరకలేదు. నేను ఏది సాధించినా అది పోరాటం వల్లే వచ్చింది. ఈ ఇల్లు రావడానికి నాకు పదహారు సంవత్సరాలు పట్టింది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో రాజకీయ నాయకులు కాకుండా న్యాయవ్యవస్థే తనకు సాయం చేసిందని ఆమె పేర్కొన్నారు. "ప్రతి ఒక్కరూ 'అవును బిడ్డా, మేము నీ కోసం చేస్తాం' అని చెప్పారు కానీ ఎవరూ ఏమీ చేయలేదు. చివరకు నేను కోర్టును ఆశ్రయించినప్పుడు మాత్రమే పని జరిగింది" అని తెలిపారు.

ఆమె కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. "నాన్న వ్యాపారం మూతపడింది. నా సోదరుడికి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ 17 ఏళ్లలో మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని" తెలిపారు. శారీరకంగా కూడా ఆమె ఇంకా నొప్పితో బాధపడుతున్నారు. "చలికాలంలో కాలు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు వాపు కూడా వస్తుంది" అని ఆమె చెప్పారు.

భవిష్యత్తు కార్యాచరణ ఏంటి?

26/11 ముంబై దాడుల కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ రాణా అరెస్టు, అప్పగంతపై దేవికా సంతోషం వ్యక్తం చేశారు. "తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు భారత్‌కు రప్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. కానీ నేను ఇంకా వేచి చూస్తున్నాను" అని ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఆగిపోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఇప్పుడు ఎలాంటి వార్తలు లేవు.. సమాచారం ఎందుకు ఆగిపోయిందో, ఏం జరిగిందో తెలియడం లేదు" అని తెలిపారు.

ఎర్రకోట, ఢిల్లీ లేదా పహల్గామ్.. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది తనను 26/11 నాటి జ్ఞాపకాలకు తీసుకెళ్తుందని ఆమె చెప్పారు. "ఆ సంఘటన గురించి విన్నప్పుడల్లా.. బాంబు పేలుడు శబ్దాలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి. బాధితులకు మాత్రమే ఆ నొప్పి తెలుస్తుంది" అని ఆమె అన్నారు.

నేడు, దేవికా ప్రజలను ధైర్యంగా నిలబడాలని కోరుతూ వివిధ కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నారు. "ఎక్కడైనా నేరం జరుగుతుంటే.. గొంతు ఎత్తండి. మీరు ఒకరి కోసం నిలబడకపోతే, ఎవరూ నిలబడరు." భయాన్ని జయించాలని ఆమె పిలుపునిచ్చారు. కసబ్‌ను కేవలం లాఠీతో ఎదుర్కొన్న తుకారాం ఓంబ్లే ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

"భవిష్యత్తులో సామాజిక సేవలో చేరడమే నా లక్ష్యం. ధైర్యమే మీ అతిపెద్ద ఆయుధమని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను" అని దేవికా అన్నారు. ఉగ్రవాదం శరీరాన్ని గాయపరచవచ్చు, కానీ ధైర్యం భయాన్ని శాశ్వతంగా జయిస్తుంది" అని తెలిపారు.

YouTube video player