డేరా సచ్ఛా సౌధా అధిపతిగా అత్యంత విలాసవంతమైన జీవితం.. దేశవిదేశాల్లో వేలకోట్ల ఆస్తులు.. సైగ చేస్తే చాలు పరిగెత్తుకొచ్చి సపర్యలు చేసే సిబ్బంది.. కానీ ఇదంతా గతం.. లైంగిక ఆరోపణల కేసులో డేరా బాబాకు రోహతక్ న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన రోహ్‌తహ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. మామూలు ఖైదిగా కూరగాయలు పండిస్తున్నాడు.. జైళ్లోకి వెళ్లిన తర్వాత డేరా బాబాకి 0.2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు..

ఆ స్థలంలో ఆయన అలోవేరా, టమోటాలు, సొరకాయలు, బీరకాయలు పండిస్తున్నారు.. రోజుకు రెండు గంటల పాటు గుర్మీత్ వ్యవసాయ పనుల్లో కష్టపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. ఈ కూరగాయలను జైలులో వంటకు వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే డేరా బాబా సంపాదిస్తున్న సొమ్ము ఆయన చేతికి అందడం లేదు..

జైలులో కష్టపడినందుకు ఖైదీలు సంపాదించే సొమ్మును వారి వారి ఖాతాల్లో జమ చేస్తారు.. అయితే గుర్మీత్ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశించడంతో ఆ సోమ్ము ఆయనకు అందజేయడం కుదరడం లేదు.. కాగా, జైలులో శిక్ష అనుభవిస్తున్న తోటి ఖైదీలకు ఆధ్యాత్మిక బోధనలు చేసేందుకు అనుమతివ్వాలని డేరాబాబా చేసిన విజ్ఙప్తిని హర్యానా ప్రభుత్వం తిరస్కరించింది.