Delhi: శాంతియుతంగా నిరసన తెలిపేందుకు దిల్లీకి తరలివచ్చిన యువతపై దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మనం కోరుకునే భారత్ ఇది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల గొంతును అణచలేరు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లు ప్రజల గొంతును నొక్కలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బెదిరింపులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవారు, రాజ్యాంగ విలువలను గౌరవించేవారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాల్సిన సమయమిదని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న (సోమవారం) పార్టీలు, వర్గాలకు అతీతంగా దేశమంతా కలిసి సుప్రీంకోర్టు వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పోలీసులు తమను బలవంతంగా తరలించారు.. సీజేపీ ప్రతినిధుల ఆరోపణ
దిల్లీలో జరిగిన పరిణామాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు బలవంతంగా విమానంలోకి ప్రవేశించి తమను కిడ్నాప్ చేసినట్లు వ్యవహరించారని అన్నారు. తమను అదుపులోకి తీసుకునే సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. న్యాయవాదిని సంప్రదించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఆదివారం విడుదలైన అనంతరం సీజేపీ ప్రతినిధులు దిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలో భయాందోళనలకు గురిచేసే వాతావరణం నెలకొందని సౌరవ్ దాస్ విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు ఇంతగా ప్రయత్నించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. తమ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించబోమని స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. సీజేపీ నేతల విమర్శలు
దిల్లీలో శనివారం చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎమర్జెన్సీ సమయంలో నెలకొన్న పరిస్థితులను గుర్తుచేశాయని సీజేపీ నేత అశుతోష్ రాంకా వ్యాఖ్యానించారు. నిరసనలను అడ్డుకునే క్రమంలో రైలు రాకపోకలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభ్యంతరాలను తెలియజేయాలనుకున్న వారిపై కఠినంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలతోనే ఘర్షణకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థపై తమకు ఉన్న అభ్యంతరాలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
నిరసనలపై 20 కేసులు.. 15 మందికి పైగా పోలీసులకు గాయాలు
శనివారం దిల్లీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. విద్యార్థులపై దాడి చేయడం, మహిళలను దుర్భాషలాడటం వంటి అభియోగాలకు సంబంధించి అదుపులోకి తీసుకున్న నలుగురిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిరసనల సమయంలో చోటుచేసుకున్న ఘటనల్లో 15 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడినట్లు వెల్లడించారు.


