నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. గురువారం ఉదయం పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోట వద్దకు భారీగా నిరసనకారులు చేరుకున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఢిల్లీకి ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఆందోళనకారులు వస్తుండటంతో ఢిల్లీ-గురుగ్రామ్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్ని మెట్రో స్టేషన్లను సైతం మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Also Read:పౌరసత్వ ఆందోళనలు: ఇండియన్ సిటిజన్‌షిప్‌పై ఆసక్తిచూపని టిబెటన్లు

కాగా విమాన సిబ్బంది ఈ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడంతో ఇండియా, స్పైస్ జెట్, ఎయిరిండియాలు ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లవలసిన విమానాలను రద్దు చేశాయి. ఇండిగో 19, స్పైస్ జెట్, ఎయిరిండియా ఒక విమానాన్ని రద్దు చేశాయి. ఢిల్లీ నుంచి బయల్దేరే విమానాల్లో 10 శాతం విమానాలను రీషెడ్యూల్ చేసినట్లు ఇండిగో ప్రకటించింది.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు, 16 మెట్రో స్టేషన్‌ల గేట్లను మూసివేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Also Read:పౌరసత్వ రగడ: ఎర్రకోట వద్ద రణరంగం, ప్రముఖుల అరెస్ట్

జామియా ఇస్లామియా ఉదంతం దృష్ట్యా ఎర్రకోట వద్ద లాఠీఛార్జీని నిషేధించారు. మరోవైపు బెంగళూరు టౌన్ హాల్ సమీపంలోని సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.