న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు ఢిల్లీలో ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. మే 3వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టం చేసింది.

also read:కరోనా ఎఫెక్ట్: జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించిన హర్యానా సర్కార్

అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఢిల్లీ సర్కార్ తేల్చి చెప్పింది. హోటల్స్, క్లబ్‌లు, రెస్టారెంట్లలో మద్యాన్ని విక్రయిస్తే  ఆ దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాదు మద్యం దుకాణాల యజమానుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ హెచ్చరించారు.

లాక్‌డౌన్ సమయంలో ఢిల్లీ మద్యం విక్రయిస్తూ 14 మంది అరెస్టయ్యారు. నిందితుల నుండి 8,400 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లిక్కర్ అసోసియేషన్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి.

దేశంలోని పలు రాష్ట్రాలకు మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. కానీ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మెజారిటీ రాష్ట్రాలు మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వలేదు.