Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర చిక్కుముడి విప్పిన మున్సిపల్ ఇంజినీర్.. ఔరంగజేబు చంపిన షా జహాన్ కొడుకు దారాషుకో సమాధి జాడ

మొఘల్ చరిత్రలో ఓ చిక్కుముడి విప్పుకుంది. వీరి చరిత్ర చదివిన వారికి దారాషుకో అంటే అభిమానం, ఆప్యాయతలు కలుగకమానవు. షా జహాన్ కొడుకుల్లో దారాషుకో పెద్దవాడు. షా జహాన్ తర్వాత సింహాసనం అధిష్టించడానికి ఆయనే అర్హుడు. కానీ, ఆయన తమ్ముడు ఔరంగజేబు అన్న దారాషుకోను హతమార్చాడు. అప్పటి నుంచి దారాషుకో సమాధి గుట్టుగానే ఉండిపోయింది. తాజాగా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ నాలుగేళ్లు కృషి చేసి ఆయన సమాధిని కనుగొన్నారు.

delhi engineer found mughal emperor shah jahan son dara shukoh tomb
Author
New Delhi, First Published Nov 11, 2021, 4:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: చరిత్ర చదువుతున్నంత సేపు అద్భుతంగా ఉంటుంది. చక్రవర్తులు, మహా సామ్రాజ్యాలు, యుద్ధాలు, సింహాసనం కోసం కుట్రలు, కర్కశ హత్యలు.. ఇలా ఎన్నో ఆసక్తి కొల్పేవి.. రంజింపజేసే ఘటనలు ఉంటాయి. కొందరు చక్రవర్తులు ప్రజల మన్ననలు పొందితే.. ఇంకొందరు ఎవ్వరినీ ఖాతరు చేయకుండా మూర్ఖ విధానాలను అనుసరించిన వారు ఉంటారు. మన దేశ చరిత్రలో ముఘల్ చక్రవర్తులకు విశిష్ట స్థానమున్నది. దేశ వారసత్వ సంపదగా పేరున్న, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్ నిర్మించిన షా జహాన్‌ చాలా మందికి సుపరిచితుడు. అయితే, ఆయన తర్వాత నలుగురు కుమారుల మధ్య జరిగిన ఆధిపత్య పోరు కూడా చరిత్రలో రక్తాక్షరాలతో నిక్షిప్తమై ఉంది. రాజ సింహాసనం కోసం ఔరంగజేబు చంపేసిన దారాషుకో సమాధి ఎక్కడ ఉన్నదనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలి ఉన్నది. కానీ, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ ఈ రహస్యాన్ని ఛేదించారు. ఈ చిక్కుముడిని విప్పి అప్పటి ప్రజలకు, చరిత్రకారులకు ఇష్టమైన చక్రవర్తిగా ముద్రవేసుకున్న దారాషుకో సమాధిని కనిపెట్టారు.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌డీఎంసీ) ఇంజినీర్ సంజీవ్ కుమార్ సింగ్ నాలుగేళ్లుగా కష్టపడి మొఘల్ చరిత్రలో బయటికి వెలుగు చూడని ఆ రహస్యాన్ని ఛేదించారు. దారాషుకోను ఎక్కడ సమాధి చేశారనే విషయాన్ని ఆయన తన పరిశోధనలతో వెల్లడించారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆయన తాను సంపాదించిన ఆధారాలు, విప్పిన చిక్కుముళ్లను ఆర్కియాలజిస్టులు, పరిశోధనా విద్యార్థుల ముందు ఉంచారు. హుమాయున్ టోంబ్ కాంప్లెక్స్‌లోనే దారాషుకో సమాధి కూడా ఉన్నదని తెలిపారు. ఎలిమినేషన్ విధానంలో ఆయన దారాషుకో సమాధిని కనిపెట్టారు. అక్బర్ కుమారుల సమాధిగా భావిస్తున్న మురద్, దనియల్‌ల సమాధులున్న చాంబర్‌లోనే దారాషుకో సమాధి కూడా ఉన్నదని వివరించారు.

దారాషుకో సమాధిని కనిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ సభ్యుడు ఒకరూ ఈయన ఆధారాలతో ఏకీభవించారు. పర్షియన్ రచనల్లోనూ ఈ విషయమున్నదని ఢిల్లీ యూనివర్సిటీ పర్షియన్ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ ప్రొఫెసర్ అలీమ్ అష్రఫ్ ఖాన్ చెప్పారు. దనియల్, మురద్‌ల సమాధుల దగ్గరే దారాషుకో సమాధి ఉన్నదని ఆ రచనలు వివరిస్తున్నాయని అన్నారు. ఖిర్జాబాద్‌లో దారాషుకోను చంపేశారని, రక్తంతో తడిసిన దుస్తుల్లోనే ఆయను సమాధి చేశారని ఔరంగజేబు టీచర్ ఒకరు అప్పటి చరిత్రలో భాగంగా రాశారు. అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో పర్షియ బోధిస్తున్న ప్రొఫెసర్ షరీఫ్ హుసేన్ ఖాసేమి మాత్రం సంజీవ్ కుమార్ వాదనలతో విభేదించారు. సంజీవ్ కుమార్ చాలా కష్టపడ్డాడని, కానీ, ఆయన వాదనలతోనే తాను ఏకీభవించడం లేదని వివరించారు. దారాషుకోను
ఔరంగజేబు మతభ్రష్టుడిగానే చూశారని, అలాంటప్పుడు చక్రవర్తుల సమాధుల దగ్గర ఎందుకు ఆయనను సమాధి చేసి ఉంటాడని ప్రశ్నించారు. సంజీవ్ కుమార్ వాదనలు నమ్మడానికి బాగున్నాయని, కానీ, వాటికి సరైన శాస్త్రీయ ఆధారాలు కావాల్సి ఉన్నాయని వివరించారు.

Also Read: తండ్రి అంత్యక్రియలకు 600 కోట్ల ఖర్చు.. ఈ రాజు సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

షాజహాన్, ముంతాజ్‌లకు జన్మించిన దారాషుకోనే పెద్ద కొడుకు. ఆయన రాజసింహాసనం అధిష్టించడానికి అర్హుడు. కానీ, ఆయన మరో ముగ్గురు తమ్ముళ్లూ సింహాసనం కోసం పరితపించారు. ఇందులో ఒకరు ఔరంగజేబుతో కలిసిపోయాడు. ఈ ఆధిపత్య పోరు ప్రధానంగా ఔరంగజేబు, దారాషుకోకు మధ్య జరిగింది. దారాషుకోకు మిలిటరీ, యుద్ధాలు, రాజ్యాల కంటే కళలపై మమకారం ఎక్కువ. ఆయన మతఛాందసుడు కాదు. ముస్లిం, హిందూ మతాలు రెండు సామరస్యంగా ఉండాలనే ఉదారవాది. ముస్లింలోని సుఫీతత్వం, హిందూ మతంలోని వేదాంతం కలిసి మనగలవని, ఇవి రెండు సామరస్యంగా అభివృద్ధి చెందాలని తపనపడ్డాడు. కానీ, ఔరంగజేబుకు దారాషుకో అంటే ద్వేషం. ఔరంగజేబు పక్కా మతవాది. అందుకే దారాషుకోను మతభ్రష్టుడిగానే భావించేవాడు. రాజ సింహాసనం
కోసం జరిగిన ఆధిపత్య పోరులో ఔరంగజేబు ఆదేశాలతోనే దారాషుకో హతమయ్యాడు. తర్వాత తండ్రి షా జహాన్‌నూ అవమానించి గద్దెనెక్కాడు.

Follow Us:
Download App:
  • android
  • ios