మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు బీజేపీలో చేరుంటే వారిపై కేసులు వుండేవా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అప్పట్లో ఇందిరాగాంధీ మాదిరే ఇప్పుడు మోడీ కూడా వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. 

ఆప్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని కొనియాడారు. పంజాబ్‌లో ఆప్ గెలిచాక బీజేపీ ఓర్వలేకపోతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఓ కట్టుకథని ఆయన పేర్కొన్నారు. సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు ఒకవేళ బీజేపీలో చేరి వుంటే వారిపై కేసులు వుండేవి కావని కేజ్రీవాల్ ఆరోపించారు. 20 రోజుల్లో కేబినెట్ విస్తరణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. 

సిసోడియా, జైన్‌లను చూసి ఆప్ మాత్రమే కాకుండా.. యావత్ దేశమే గర్వపడుతోందన్నారు. తాము చేస్తోన్న మంచి పనిని ప్రధాని మోడీ అడ్డుకోవాలని చూస్తున్నారని.. మద్యం పాలసీ కేసు అనేది ఒకసాకు మాత్రమేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిజానికి ఢిల్లీలో ఎలాంటి కుంభకోణం లేదని.. సిసోడియా, సత్యేందర్ జైన్‌లు చూపిన బాటలో అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు మరింత వేగంగా ముందుకెళ్తారని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని.. త్వరలోనే ఇంటింటికి వెళ్లి క్యాంపెయిన్ నిర్వహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ మాదిరే ఇప్పుడు మోడీ కూడా వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. 

ALso REad: ఢిల్లీ కేబినెట్‌లోకి ఇద్దరు కొత్త మంత్రులు.. అతిషి, సౌరభ్‌ల పేర్లను ఎల్‌జీకి పంపిన కేజ్రీవాల్..!

మరోవైపు.. మనీష్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్‌లు వారి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారి రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమోదించారు. అయితే ఈ క్రమంలోనే ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ‌కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో నియమాకానికి సంబంధించి అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ పేర్లను కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాకు పంపారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇదిలా ఉంటే.. గత ఏడాది మే నెలలో మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన శాఖల బాధ్యతలను కూడా సిసోడియా నిర్వహిస్తూ వచ్చారు. అయితే గత నెల 26న మనీష్ సిసోడియాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు అనుమతించిందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిసోడియా, సత్యేంద్ర జైన్ వారి పదవులకు రాజీనామా చేయగా.. కేజ్రీవాల్ వాటిని ఆమోదించి ఎల్జీకి పంపారు.