సీఏఏ నిరసనల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో గత కొద్దిరోజులుగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలొద్దని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

ఈ హింసాత్మక ఘటనల్లో ఆప్‌కు చెందిన వారి జోక్యం ఉందని తేలితే వారిపై రెట్టింపు చర్యలు ఉంటాయని కేజ్రీవాల్ హెచ్చరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన వారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read:అర్థరాత్రి చెలరేగిన హింస: 34కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అల్లర్లలో గాయపడిన వారికి ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చును తమ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

భజన్ పురా, మౌజ్ పూర్, కారావాల్ నగర్ ల్లో బుధవారం రాత్రి అల్లర్లు మళ్లీ అల్లర్లు చెలరేగాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించి వెళ్లి కొన్ని గంటలైనా గడవక ముందే ఈ ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీని కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 35కి చేరింది. 

Aslo Read:ఢిల్లీ అల్లర్లు: బాలిక మిస్సింగ్, ఢిల్లీ ప్రజల కష్టాలు ఇవీ....

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వస్తున్నారు. ఢిల్లీ పోలీసులు 18 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 106 మందిని అరెస్టు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని చెబుతున్నారు. 

శాంతిని పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా విజ్ఢప్తి చేశారు. భద్రతా బలగాలు ప్రభావిత ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. కొత్త నియమితులైన ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) ఎస్ఎన్ శ్రీవాత్సవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.