న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో పరీక్షలు రాయడానికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయింది. ఖజూరీ ఖాస్ ప్రాంతంలో పరీక్షలు రాయడానికి రెండు రోజుల క్రితం 13 ఏళ్ల బాలిక వెళ్లింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, హింస నేపథ్యంలో ఆమె జాడ కనిపించడం లేదు. 

ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోనియా విహార్ సివారులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. పరీక్షలు రాయడానికి సోమవారం ఉదయం ఇంటి నుంచి 4.5 కిలోమీటర్ల దూరంలో గల బడికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియడం లేదు. 

Also Read: అర్థరాత్రి చెలరేగిన హింస: 34కు చేరిన ఢిల్లీ మృతుల సంఖ్య

రెడీమేడ్ గార్మెంట్స్ పని చేసే ఆమె తండ్రి పీటీఐతో తన ఆవేదనను చెబుకున్నాడు. సాయంత్రం 5.20 గంటలకు తన కూతురిని తీసుకుని రావడానికి తాను వెళ్లాల్సి ఉండిందని, అయితే అల్లర్లలో తాను చిక్కుకుపోయానని, దాంతో వెళ్లలేకపోయానని, అప్పటి నుంచి ఆమె కనిపించడం లేదని చెప్పారు. మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్నామని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. 

రెండు రోజుల క్రితం శివ విహార్ లోని ఓ ఇంట్లో చిక్కుకున్న తన కుటుంబ సభ్యులను తాను చేరుకోలేకపోతున్నట్లు మౌజ్ పూర్ లోని విజయ పార్కులో ఉండే వ్యక్తి చెప్పారు. 

మెదీనా మసీదు వద్ద గల శివ్ విహార్ లో తనకు ఓ ఇల్లు ఉందని, తన ఇద్దరు పిల్లలు అక్కడ నివసిస్తారని, ఇద్దరు పిల్లలు ఇక్కడ విజయ్ పార్కులో నివసిస్తున్నారని, అల్లర్ల కారణంగా తాను తన పిల్లలను చేరుకోలేకపోతున్నానని దాదాపు 70 ఏళ్ల వయస్సు గల మొహమ్మద్ షబీర్ అన్నారు. 

Also Read: రొటీన్: జస్టిస్ మురళీధర్ బదిలీపై రవిశంకర్ ప్రసాద్ వివరణ

ఓ గుంపు తమ ఇంటిని చుట్టుముట్టిందని, వాళ్లు తప్పించుకోగలిగారని, వారెక్కడున్నారో తనకు తెలియడం లేదని, పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఆయన అన్నారు.

ఢిల్లీ అల్లర్లలో 34 మంది మరణించగా, 200 మంది దాకా గాయపడ్డారు. ఆదివారం ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ ఆగడం లేదు.