కేజ్రీవాల్ నోట జవాన్ డైలాగ్.. విద్యపై ఓట్లు అడిగే ఏకైక పార్టీ ఆప్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జవాన్ సినిమా డైలాగ్ కొట్టారు. జవాన్ డైలాగ్‌ను పేర్కొంటూ 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో మంచి విద్యను అందిస్తామని హామీ ఇచ్చి ఓట్లు అడిగే ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ జవాన్‌లోని ఓ డైలాగ్‌ను అరవింద్ కేజ్రీవాల్ ఉటంకించారు. ఎవరైనా ఓటు అడగడానికి వచ్చినప్పుడు మతం పేరిట, కులం పేరిట ఓటు వేయవద్దని అందులో షారుఖ్ ఖాన్ ఓ డైలాగ్‌లో సూచిస్తారని కేజ్రీవాల్ అన్నారు. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తారా? తమ కుటుంబానికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారా? అని అడిగి జాగ్రత్తగా ఓటేయాలని సూచిస్తారని గుర్తు చేశారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి ఓట్లు అడిగే ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని కేజ్రీవాల్ వివరించారు. తాము ఢిల్లీలో మంచి విద్యను అందిస్తున్నామని అన్నారు. అయితే, ఢిల్లీ చిన్న ఏరియా అని, అందులో మంచి విద్యను అందించడం సాధ్యమవుతుందని ఆరోపణలు చేశారని వివరించారు. కానీ, ఇప్పుడు భగవంత్ మాన్ సింగ్ సారథ్యంలో పంజాబ్ రాష్ట్రంలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పారు.
Also Read: వచ్చే నెలలో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ.. సీట్ల పంపకాల ప్రక్రియ షురూ
బుధవారం రోజే జవాన్ సినిమాను తమకు అనుకూలంగా చేసుకుని బీజేపీ మాట్లాడింది. కాంగ్రెస్ హయాంలోని పదేళ్ల అవినీతి పాలనను జవాన్ ఎత్తి చూపించిందని కామెంట్ చేసింది. ఈ విషయాన్ని చెప్పినందుకు షారుఖ్ ఖాన్‌కు ధన్యవాదాలు చెప్పాలని పేర్కొంది. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ పాత్ర ఓటర్లను ఉద్దేశించి శక్తిమంతమైన డైలాగ్‌లు చెబుతుంది.