Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు సంఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే భారత భద్రతా వ్యవస్థ తక్షణమే స్పందించింది.
ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరి
భారత ప్రభుత్వం మరోసారి ఉగ్రవాదంపై తన దృఢమైన వైఖరిని స్పష్టంగా చూపించింది. ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జైసే ఈ మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్‌ను తక్షణమే గుర్తించి నిర్వీర్యం చేయడం ద్వారా దేశం కఠిన సందేశం పంపింది. ఇది భారత గూఢచారి సంస్థలు, భద్రతా దళాలు, పోలీసు వ్యవస్థల కృషి ఫలితంగా సాధ్యమైంది.
విచారణ ఎలా జరిపారంటే.?
ఎర్రకోట పేలుడు మూలాన్ని జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ నవ్గామ్ పోలీస్ పోస్ట్ పరిధిలో కనుగొన్న పోస్టర్ల ఘటనతో లింక్ చేశారు. దీనికి సంబంధించి అక్టోబర్ 19, 2025న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తదుపరి విచారణలో మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాఘే (షోపియన్), జమీర్ అహ్మద్ (గందర్‌బల్)లను అక్టోబర్ 20 నుంచి 27 మధ్య అరెస్ట్ చేశారు.
కీలక అరెస్టులు, స్వాధీనం చేసిన ఆయుధాలు
* నవంబర్ 5, 2025: డాక్టర్ అదీల్‌ను సహరన్‌పూర్‌లో అరెస్ట్ చేశారు.
* నవంబర్ 7, 2025: అనంతనాగ్ హాస్పిటల్ నుంచి AK-56 రైఫిల్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
* నవంబర్ 8, 2025: ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్ నుంచి గన్స్, పిస్టల్స్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విచారణలో డాక్టర్ ముజమ్మిల్ (అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్)ను కూడా అరెస్ట్ చేశారు. తర్వాత మరికొంత మందిని పట్టుకుని పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
భారీ పేలుడు పదార్థాల స్వాధీనం
* నవంబర్ 9, 2025: “మదరాసి” అనే వ్యక్తిని ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేశారు.
* నవంబర్ 10, 2025: మేవాట్‌కు చెందిన హఫీజ్ మహ్మద్ ఇష్టియాక్ ఇంటి నుండి 2,563 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం చేశారు. ఇతను అల్-ఫలాహ్ మస్జిద్ ఇమామ్‌గా గుర్తించారు. అదనంగా 358 కిలోల పేలుడు పదార్థం, డెటోనేటర్లు, టైమర్లు కూడా కనుగొన్నారు. మొత్తం 3,000 కిలోల పేలుడు పదార్థం ఈ మాడ్యూల్ నుంచి బయటపడింది.
ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ పరారీలో
అల్-ఫలాహ్ మెడికల్ కాలేజ్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఉమర్ ఈ మాడ్యూల్‌లో ప్రధాన పాత్రధారి. సంస్థల దాడులు ముమ్మరమయ్యాక అతను తప్పించుకున్నాడు. CCTV ఫుటేజ్ ప్రకారం, రెడ్ ఫోర్ట్ పేలుడు జరిగిన కారు డ్రైవర్ కూడా డాక్టర్ ఉమర్‌నే అని తెలిసింది. దిల్లీ పేలుడు కోసం ఉపయోగించిన పదార్థం, ఫరీదాబాద్‌లో పట్టుబడిన అదే రకమైన పేలుడు పదార్థం అని నిర్ధారించారు. పేలుడు ప్లాన్ చేసినదా లేదా యాదృచ్ఛికమా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ నిర్వీర్యం
భారత గూఢచారి సంస్థలు, భద్రతా బలగాలు సమన్వయంతో ఫరీదాబాద్ మాడ్యూల్‌ను పూర్తిగా విచ్ఛిన్నం చేశాయి.
దేశంలో పెద్ద స్థాయిలో నష్టం కలిగించాలనే కుట్రను భగ్నం చేశాయి. డాక్టర్ ఉమర్ భయం, గందరగోళం కారణంగా రెడ్ ఫోర్ట్ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
తక్షణ చర్యలు, కేంద్ర ప్రభుత్వ స్పందన
* నవంబర్ 10, 2025 సాయంత్రం 6:55 గంటలకు దిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు జరిగింది.
* తక్షణమే దిల్లీ పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
* సాయంత్రం 7:15కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, దిల్లీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
* రాత్రి 9:00కు ఆయన మీడియాకు సమాచారం ఇచ్చారు.
* ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
* రాత్రి 9:30 నుంచి 10:20 వరకు అమిత్ షా హాస్పిటల్, ఘటన స్థలాలను సందర్శించారు.
దర్యాప్తు NIAకి బదిలీ
* నవంబర్ 11, 2025 ఉదయం హోం మంత్రి రెండు అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
* మొదటి సమావేశంలో: హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, NIA డీజీ, దిల్లీ పోలీస్ కమిషనర్, J&K DGP (వర్చువల్‌గా) పాల్గొన్నారు.
* రెండవ సమావేశంలో: NSG, DFSS, FSL అధికారులతో సమీక్ష జరిగింది.
* మధ్యాహ్నం 2:30కు కేసు అధికారికంగా NIAకి బదిలీ అయింది.
* ప్రధాని మోదీ నిరంతర సమీక్ష కొనసాగించారు.
* DNA, పేలుడు అవశేషాలు, ఇతర ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.
