ఈ రోజు రాజ్యసభలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య జరిగే చర్చకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఢిల్లీ బిల్లును ఈ రోజు ప్రవేశపెట్టనుండటంతో అందరు ఎంపీలు తప్పక హాజరవ్వాలని విప్‌లు జారీ చేసుకున్నారు. 

న్యూఢిల్లీ: ఈ రోజు రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య నువ్వా.. నేనా అన్నట్టుగా చర్చ జరగనుంది. ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో రాజ్యసభలో ఉభయ పక్షాలు అమ్ములపొదిలోని అస్త్రాలను సంధించడానికి సమాయత్తం అవుతున్నాయి. ఈ రోజు తప్పకుండా సభకు హాజరై పార్టీలు చెప్పినట్టు ఓటేయాలని ఇప్పటికే అన్ని పార్టీల విప్‌లు ఎంపీలకు జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాజ్యసభకు రావాల్సిందేనని విప్‌లు రావడంతో మన్మోహన్ సింగ్, శిబు సోరెన్‌లు వీల్ చైర్లపై వచ్చేయనున్నట్టు తెలిసింది. అంతేకాదు, జేడీయూ లీడర్ వశిష్ట నారాయణ్ సింగ్ అంబులెన్స్‌లో పార్లమెంటుకు రాబోతున్నట్టు సమాచారం.

ఢిల్లీ పరిపాలనా సేవలను నియంత్రించే అధికారాన్ని సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా తమ వద్ద ఉంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దాని తాలూకు బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా.. తిరుగులేని స్థాయిలో మెజార్టీ ఉన్న ఎన్డీయే సునాయసంగా ఆమోదింపజేసుకుంది. సోమవారం ఈ ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు.

రాజ్యసభలో బిల్లు నెగ్గించుకోవడం ఎన్డీయేకు అంత సులువేమీ కాదు. కానీ, అసాధ్యం అని చెప్పడానికి లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎన్డీయే కూటమి బయటి నుంచి దానికి మద్దతు లభిస్తున్న తరుణంలో రాజ్యసభలోనూ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదింపచేసుకోవచ్చు.

Also Read: పార్లమెంటులో నేడు రాహుల్ గాంధీ అడుగుపెట్టేనా? అన్ని కళ్లు స్పీకర్ పైనే, ఎందుకంటే?

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆప్ ఇతర విపక్ష పార్టీల సహకారం కోరిన సంగతి తెలిసిందే. కేంద్రంపై ఈ విషయమై తీవ్ర విమర్శలు సంధించారు. ప్రతిపక్షాల కూటమిలో చేరడానికి కూడా ఈ బిల్లు అంశాన్నే కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటంగా పెట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఈ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఆప్ ఈ కూటమి బెంగళూరులో నిర్వహించిన విపక్షాల భేటీకి హాజరైంది.

సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిషా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే, సాయంత్రానికల్లా ఈ బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ బిల్లును ఎలాగైనా నెగ్గించుకోవాలని కేంద్రం ఆరాటపడుతుండగా.. విపక్షాలు మాత్రం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓడించాలని నిర్ణయించుకుంది. అందుకే సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, శిబు సోరెన్‌లు అనారోగ్యంగా ఉన్నప్పటికీ వారిని వీల్ చైర్‌లలో పార్లమెంటుకు తీసుకురానున్నారు. జేడీయూ నేత వశిష్ట నారాయణ్ సింగ్ ఏకంగా అంబులెన్స్‌లోనే పార్లమెంటుకు చేరునున్నారు.

రాజ్యసభలో ఎన్డీయేకు 111 మంది సభ్యులున్నారు. కాగా, విపక్ష ఇండియా కూటమికి 98 మంది మాత్రమే ఉన్నారు. రాజ్యసభ సంఖ్యాబలం 245. కానీ, ఏడు సీట్లు ఖాళీగా ఉండటంతో ఇప్పుడు కేవలం 238 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 120 మంది సభ్యులు మెజార్టీ సంఖ్య.

రాజ్యసభలో ఎన్డీయేకు 111 మంది సభ్యులు ఉన్నారు. కాగా, ఇండియా కూటమి 98 మంది సభ్యులు ఉన్నారు. ఇకపోతే వైసీపీ, బీజేడీలు(18 మంది సభ్యులు) బయటి నుంచి ఎన్డీయేకు తమ మద్దతు ప్రకటించాయి. దీనికి తోడు టీడీపీ కూడా బీజేపీ వైపే మొగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ మద్దతులతో బీజేపీ అవసరం ఉన్న మెజార్టీ కంటే కూడా మరో 10, 12 సీట్లను అధికంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి.