ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి షాకిచ్చారు. నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు.

తీర్మానం కోసం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలా మందికి బర్త్ సర్టిఫికెట్లు లేవన్నారు.

Also Read:ఢిల్లీ అల్లర్లు: 20 మంది మృతి, సైన్యాన్ని దింపాలని కేజ్రీవాల్

తమ లాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్ధితి ఏంటని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని, పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా..? అని ప్రశ్నించారు.

పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. కేంద్ర మంత్రులు వారి బర్త్ సర్టిఫికెట్లు చూపించాలని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. చేతులెత్తి వేడుకుంటున్నా ఇలాంటి చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Also Read:అంకిత్ శర్మ హత్యలో ఆప్ నేత పాత్ర: కేజ్రీవాల్ స్పందన ఇదీ...

అంతకుముందు బర్త్ సర్టిఫికెట్లు ఉన్నవారు చేతులు పైకి ఎత్తాలని సీఎం కోరగా.. 9 మంది ఎమ్మెల్యేలు చేతులు పైకి ఎత్తారు. కాగా ఎన్ఆర్‌సీ వ్యతిరేకంగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.