బాంబేలోని ఐఐటీలో దళిత విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శన్ సోలంకి ఆత్మహత్యకు ముందు తన తండ్రితో అరగంట పాటు ఫోన్ లో మాట్లాడాడు. అయితే అందులో కుల వివక్ష ప్రస్తావన రాలేదని చెప్పారు. 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- బాంబేలో 18 ఏళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. క్యాంపస్ లో దర్శన్ కుల వివక్షను ఎదుర్కొన్నాడని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఓ విద్యార్థి సంఘం ఆరోపించడంతో 2016లో దేశాన్ని కుదిపేసిన రోహిత్ వేముల కేసు మరో సారి గుర్తుకు వచ్చింది. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అందులో భాగంగా పోలీసులు దర్శన్ సోలంకి తండ్రిని విచారించారు. అయితే బాధితుడు ఆత్మహత్య చేసుకునే ముందు తన తండ్రితో 30 నిమిషాలు ఫోన్ లో మాట్లాడాడని తేలింది. కానీ అందులో కుల వివక్షను ఎక్కడా ప్రస్తావించలేదని పోలీసులు పేర్కొన్నారు. 

యూపీలో ఢీకొన్న రెండు గూడ్స్ రైళ్లు.. ఘటన స్థలంలో కొనసాగుతున్న ట్రాక్ క్లియరెన్స్ పనులు..

అయితే దర్శన్ సోలంకి దారుణానికి ఒడిగట్టడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి పోలీసులు అతడి హాస్టల్ రూమ్ మేట్స్ వాంగ్మూలాలను నమోదు చేయడం ప్రారంభించారు. దళిత విద్యార్థి అయిన సోలంకి క్యాంపస్ లో కులవివక్షను ఎదుర్కొంటున్నాడని ఓ విద్యార్థి సంస్థ ఆరోపించింది. కానీ ఐఐటీ బాంబే యంత్రాంగం ఈ ఆరోపణను ఖండించింది.

గత ఆదివారం (ఫిబ్రవరి 12) ఇన్స్టిట్యూట్ లోని పొవాయ్ క్యాంపస్ లో ఉన్న హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి 18 ఏళ్ల విద్యార్థి దర్శన్ సోలంకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అహ్మదాబాద్ కు చెందిన ఆ యువకుడు బీటెక్ (కెమికల్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా.. ఈ కేసులో ఇప్పటి వరకు డజను మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసినట్లు దర్యాప్తులో పాల్గొన్న సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపినట్టు ‘ఎన్డీటీవీ’ నివేదించింది. కుమారుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న తరువాత క్యాంపస్ కు వచ్చిన తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించారు. కానీ వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, కుమారుడి ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేయలేదని పోలీసులు చెప్పారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: ప్రజాస్వామ్య పండుగలో పెద్ద సంఖ్య‌లో పాల్గొనండి..: ఓటర్లకు జేపీ నడ్డా విజ్ఞప్తి

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సోలంకి తన తండ్రితో అరగంట పాటు మాట్లాడాడని, అయితే సంభాషణ సమయంలో అతడు ఇన్స్టిట్యూట్ లో వివక్షను ఎదుర్కొనే విషయంలో ఏమీ మాట్లాడలేదని పోలీసు అధికారి తెలిపారు. ఫిబ్రవరి 15న ఇంటికి వస్తానని సోలంకి తన తండ్రికి తెలిపారు. కాగా.. దర్శన్ మృతదేహాన్ని మంగళవారం అహ్మదాబాద్ కు తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు ప్రతీ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ...!

ఇదిలా ఉండగా.. అంతకు ముందు బుధవారం నాడు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఐఐటీ-బాంబేని సందర్శించారు. దర్శన్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్శన్ ఆదివారం తన తండ్రికి ఫోన్ చేసి మొదటి సెమిస్టర్‌లో ఒక పేపర్ మినహా మిగతా పరీక్షలు బాగా జరిగాయని తెలియజేసినట్లు అథవాలే చెప్పారు.