Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌ అతలాకుతలం: నేడు అరేబియా సముద్రంలో అస్నా తుఫాను.. భారీ వర్షాలు

అస్నా తుఫాను ప్రభావంతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసి సహాయక చర్యలను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

Cyclone Asna Hits Gujarat: Heavy Rains and Floods Wreak Havoc GVR
Author
First Published Aug 30, 2024, 11:29 AM IST | Last Updated Aug 30, 2024, 11:29 AM IST

అహ్మదాబాద్: గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గుజరాత్‌లోని కచ్, దేవభూమి ద్వారకా, జామ్‌ నగర్‌ జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

కాగా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం అస్నా తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ తుఫాను శుక్రవారం అరేబియా సముద్రంలో తీరం దాటనుందని తెలిపింది. 1976లో వచ్చిన ఈ తుఫాను.. ఈ ఆగస్టులో తొలిసారిగా అస్నాగా మారనుంది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర- కచ్ ప్రాంతం నుంచి ఒమన్ తీరం వైపు ఈ తుఫాను ప్రయాణించే అవకాశం ఉంది.

కచ్, ఈశాన్య అరేబియా సముద్రం, పాకిస్థాన్ పరిసర ప్రాంతాలు, భుజ్ (గుజరాత్)కు 90 కిలోమీటర్ల దూరంలో తీవ్ర అల్పపీడనం ఉందని ఐఎండీ ట్వీట్ చేసింది. కాగా, గుజరాత్‌లోని కాండ్లా తీరంలో తుపాను తీవ్ర అలలు వీస్తున్నాయి. నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై.. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.

రైళ్ల రాకపోకలు పునఃప్రారంభం

వడోదరలో గురువారం ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో వరద నీరు పోటెత్తింది. ఆ వరద నీరు శుక్రవారం ఉదయం తగ్గుముఖం పట్టడంతో రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.

మరోవైపు, ద్వారకాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపట్టింది. శుక్రవారం గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లా కలెక్టర్ అమిత్ అరోరా స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలావుండగా, గురువారం వర్షం పరిస్థితి కొద్దిగా మెరుగుపడినప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వడోదర నగరంతో సహా పలు ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తగ్గలేదు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కచ్, జామ్నగర్, పక్కనే ఉన్న దేవభూమి ద్వారకా జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేశారు. కచ్, దేవభూమి ద్వారకా జిల్లాల్లోని తీర ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పగటి పూట వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం పటేల్ తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసిన గత 36 గంటల్లో కచ్ జిల్లాలోని మాండ్వి తాలూకాలో 469 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది. వడోదర, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, కచ్ జిల్లాల్లో ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios