Coronavirus : చైనాలో పెరుగుతున్నకరోనా కేసులు.. భారత్ కు ముప్పు తప్పదా?
Coronavirus: చైనా, ఆగ్నేయాసియా సహా పలు యూరోపియన్ దేశాలలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం భారత్ లో ఆందోళనలను లేవనెత్తాయి. ఆయా దేశాల్లో ప్రభావంతో మళ్లీ భారత్ లో కోవిడ్ పంజా విసరనుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Covid 4th wave: భారత్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. దీంతో కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆ తర్వాత భారత్ సహా చాలా దేశాల్లో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పాట్టాయి. అయితే, గత మూడు వారాల నుంచి చైనా, ఆగ్నేయాసియా మరియు కొన్ని యూరోపియన్ దేశాలలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం భారత్ లో ఆందోళనలను లేవనెత్తాయి. ఆయా దేశాల్లో కరోనా వైరస్ విజృంభణకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 అని పరిశోధకులు తేల్చారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కరోనా కేసులు ఆకస్మిక పెరుగుదలతో మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నాయి.
ఆయా దేశాల్లో కరోనా ప్రస్తుత వ్యాప్తి భారతదేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్ వేవ్ భయాందోళనలు రేకెత్తిస్తోంది. 2019 వుహాన్ లో కరోనా వ్యాప్తి తర్వాత చైనా ప్రస్తుతం తన అతిపెద్ద కోవిడ్ వేవ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆ దేశంలోని చాలా నగరాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ.. కఠిన ఆంక్షలు విధించే స్థాయికి పరిస్థితులను దిగజార్చింది. హుబే ప్రావిన్స్, సరిహద్దు ప్రాంతాలతో పాటు మధ్య చైనా ఆర్థిక కేంద్రంగా పరిగణించబడే షాంఘై నగరంలో రెండు దశల లాక్‌డౌన్ విధించింది అక్కడి సర్కారు. 26 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై నగరం మొదటి భాగంలో నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేయబడుతుంది. తరువాత నాలుగు రోజుల పాటు నగరంలోని ఇతర భాగంలో ఆంక్షలు విధించబడతాయి. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం సమర్థవంతమైన కోవిడ్ పరీక్షలను నిర్వహించడం మరియు ఇప్పటివరకు అతిపెద్ద వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడమని అధికారులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పలు యూరప్ దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలతో ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇక ఆయా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో భారత్ లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో భారత్ లో 1,225 కొత్త కోవిడ్ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. అలాగే, 1,594 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. మార్చి 20న దేశంలో 1,761 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు రెండేళ్లలో అత్యల్ప ఒకేరోజు కరోనా గణాంకాలు. మార్చి 15తో ముగిసిన వారంలో 3,536 సగటు కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచ కేసులలో భారతదేశం కేవలం 0.21% మాత్రమే అందించింది. మూడవ వేవ్ తర్వాత, భారతదేశంలో కేసులు తగ్గుతూ.. చైనా మరియు ఇతర దేశాల కంటే పరిస్థితి చాలా భిన్నంగా మారింది. ఈ క్రమంలోనే దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేశాయి.
అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ గణాంకాలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ఎత్తిచూపుతూ.. రాబోయే నెలల్లో తాజా కరోనా ఉప్పెన ప్రమాదం చాలా తక్కువగా ఉందని నిపుణులు అభిప్రయపడుతున్నారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోవిడ్ ను తక్కువగా అంచనా వేయడం లేదు. ఇప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ చివరిదికాకపోవచ్చుననీ, తదుపరి వేరియంట్లు మరింతగా విజృంభించే అవకాశాలున్నాయని పేర్కొంటోంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.