కరోనా వైరస్ సోకిన వారితో పాటు అనుమానితులను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. అయితే అక్కడి సదుపాయాలు నచ్చక కొందరు ఐసోలేషన్ వార్డుల్లోంచి తప్పించుకుని పారిపోతున్న ఘటనలు దేశంలో కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఐసోలేషన్ వార్డులో సరైన సౌకర్యాలు లేవని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన 70 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్య సిబ్బంది ఆయనను అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.

Also Read:బ్యాంకులకు డబ్బులెగ్గొట్టిన 50 కంపెనీల్లో రాయపాటి ట్రాన్స్ టాయ్ కూడా...

ఆయనతో పాటు కుటుంబసభ్యులకు పాజిటివ్‌గా తేలడంతో వారిని కూడా ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ సరైన భోజన వసతి లేదని, శుభ్రతను పాటించడం లేదని సదరు వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

అలా నడుచుకుంటూ అక్కడికి 17 కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆయన ఇంటి బయట కూర్చొని ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు ఆరా తీయడంతో అసలు మేటర్ వెలుగులోకి వచ్చింది.

Also Read:కరోనా దెబ్బ: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే రూ. 5 వేలు ఫైన్

దీంతో వారు స్థానిక కార్పోరేటర్‌కు, వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. ఆయనను తరలించేందుకు కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బందితో ఐసోలేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడకపోగా, వారితో వాగ్వాదానికి దిగాడు. చివరికి అధికారులు మరో అంబులెన్స్‌లో సదరు వ్యక్తి కుమారుడిని అక్కడికి తీసుకొచ్చారు.

ఆయన తండ్రితో మాట్లాడి ఎట్టకేలకు ఐసోలేషన్ కేంద్రానికి వెళ్లేందుకు ఒప్పించాడు. ఈ సంగతి పక్కనబెడితే.. ఆ పెద్దాయన ఐసోలేషన్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎవరినైనా కలిశాడా..? అన్న టెన్షన్ అధికారుల్లో మొదలైంది. అయితే ఆయన ఎవరినీ కలవలేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.