అధికార, ప్రతిపక్షాల ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమే దేశం పేరు మార్పు - బీఎస్పీ చీఫ్ మాయావతి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశం పేరుతో ఆడుకోవడానికి ప్రతిపక్షాలే అవకాశం ఇచ్చాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. అధికార, ప్రతిపక్షాల పక్కా ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమే ఈ పేరు మార్పు అని చెప్పారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇండియా టు భారత్ చర్చలో ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) అధినేత్రి మాయావతి చేరారు. ఈ అంశంపై తాజాగా మౌనం వీడిన ఆమె.. ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా’పై విరుచుకుపడ్డారు. దేశం పేరుతో ఆడుకోవడానికి బీజేపీకి ప్రతిపక్షాలే అవకాశం ఇచ్చాయని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
పక్కా కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తమ కూటమి పేరును ఇండియాగా ఉంచి, రాజ్యాంగంలో మార్పులు చేసుకునే అవకాశాన్ని బీజేపీ-ఎన్డీయేకు ఇచ్చాయని మాయావతి ఆరోపించారు. ఇది అధికార, ప్రతిపక్షాల ప్రణాళికాబద్ధమైన కుట్ర అని అన్నారు. ‘‘ఎన్నికలకు ముందు వారు చేసిన రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ వివాదం ముసుగులో వారు నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టారు’’ అని అందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు చేసిన తరువాత దానికి వ్యతిరేకంగా బీజేపీ-ఎన్డీయే కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందని మాయావతి అన్నారు. అలాగే దేశం పేరును పోలిన కూటమి పేరు ఉండకూడదని చెప్పే చట్టం చేయాల్సిందని తెలిపారు. ఇలాంటి పార్టీలు, పొత్తులపై సుప్రీంకోర్టు దృష్టి సారించాలని, దేశం పేరున్న వాటిని నిలిపివేయాలని ఆమె కోరారు. ‘ఇండియా’,‘భారత్’లపై జరుగుతున్న నీచ రాజకీయాలను సుమోటోగా స్వీకరించాలని, దేశం పేరుతో ఏర్పాటు చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలను నిషేధించాలని మాయావతి సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
భారత్ అంటే ఇండియా అని, అది సుప్రసిద్ధ, గౌరవప్రదమైన రాజ్యాంగ నామమని ఆమె పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాలకు చెందిన మన దేశ ప్రజలకు బాబా సాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ పవిత్ర మానవతా, ప్రజా సంక్షేమ రాజ్యాంగం పట్ల అపారమైన ప్రేమ, గౌరవం ఉందని అన్నారు. ఇలా పేర్లు తారుమారు చేసి మనోభావాలతో ఆడుకోవడం చాలా తగదని మాయావతి అన్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ అటు ఎన్డీయేతో గానీ, ప్రతిపక్ష కూటమి ఐఎన్డీఐఏతో గానీ పొత్తు పెట్టుకోలేదు. తమ పార్టీ పలు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మాయావతి గతంలోనే స్పష్టం చేశారు.