దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనేది నేడు తెలియనుంది. ఈ నెల 18వ తేదీన నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేటి ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి.
మూడు రోజుల కిందట జరిగిన రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నేడు చేపట్టనున్నారు. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఉదయం 11.00 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు పోటీపడ్డారు. ఒకరు అధికార ఎన్డీఏ తరుఫు నుంచి కాగా మరొకరు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి. అయితే వీరిలో నేడు ఎవరో ఒకరు 15వ రాష్ట్రపతిగా ఎన్నికకానున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కాలం జూలై 24వ తేదీతో ముగియనుంది.
ఈ పోటీలో అధికార ఎన్‌డీఏకు చెందిన ద్రౌపది ముర్ము, ప్రతిపక్షానికి చెందిన యశ్వంత్ సిన్హా ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. కాగా ముర్ముకు అనుకూలంగా ఎక్కువగా ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మొదటి గిరిజన మహిళగా రికార్డుకు ఎక్కుతారు.
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటుకు 14 మంది దుర్మరణం.. రూ. 4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం యోగి
ఈ నెల 18వ తేదీన పార్లమెంట్ ఆవరణలో అలాగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఒకే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ నిర్వహించారు. వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ భారీ భద్రతతో పార్లెమెంటుకు చేరుకున్నాయి. వాటిని స్ట్రాంగ్ రూంలో భద్రపర్చరారు. ఇప్పుడు 63వ గదిలో కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. సాయంత్రంలోగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొదటగా ఎంపీల ఓట్లను లెక్కించిన తర్వాత మళ్లీ అక్షర క్రమంలో 10 రాష్ట్రాల ఓట్లను లెక్కిస్తారు. తరువాతనే పోల్ ట్రెండ్ లను వివరిస్తారు. 20 రాష్ట్రాల ఓట్లను లెక్కించిన తర్వాత పోల్ ట్రెండ్స్‌పై ఆయన మరోసారి బ్రీఫ్ చేసి మొత్తం కౌంటింగ్ తర్వాత చివరకు ఫలితాలను ప్రకటిస్తారని వర్గాలు వెల్లడించాయని ‘ది హిందూ’ నివేదించింది.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌తో సహా 31 స్థానాలు, రాష్ట్ర శాసనసభల పరిధిలోని 30 కేంద్రాల్లో జరిగింది. అయితే అనేక రాష్ట్రాల్లో ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నివేదికలు కూడా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలో సభ్యులకు విప్ జారీ చేయలేదు. నామినేటెడ్ ఎంపీలు మినహా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, అన్ని రాష్ట్రాల్లోని శాసనసభలోని ఎమ్మెల్యేలందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా వ్యవహరిస్తారు.
పెళ్లి చేసుకుని ఐదేళ్లు గడిచినా.. పిల్లలు పుట్టలేదని మనస్తాపం.. ఆత్మహత్య
776 మంది ఎంపీలు, 4,033 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 4,809 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. అయితే నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులకు ఈ అవకాశం ఉండదు. సోమవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం ఓటర్లలో 99 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా బీజేపీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.
నటుడు, రాజకీయ నాయకుడు డియోల్ వైద్య చికిత్స కోసం విదేశాల్లో ఉన్న కారణంతో ఓటు వేయలేకపోయారు. దోత్రే కూడా కూడా ఐసీయూలో ఉన్నారు. అలాగే బీజేపీ, శివసేనలకు చెందిన ఇద్దరు ఎంపీలు, బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీ, ఏఐఎంఐఎంల నుంచి ఒక్కొక్కరు ఓటింగ్‌కు దూరమయ్యారు. కాగా 10,69,358 ఓట్లకు గాను 7,02,044 ఓట్లు సాధించి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి మీరా కుమార్ కేవలం 3,67,314 ఓట్లు మాత్రమే సాధించారు.
