మహారాష్ట్రలో ఓ వ్యక్తి సంతానం కలుగడం లేదని మనస్తాపం చెందాడు. పెళ్లి చేసుకుని ఐదేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ముంబయి: మహారాష్ట్రలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. తమకు పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయిలోని కుర్లాలో జరిగింది. బుధవారం పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

కుర్లాలోని ఖురేషీ నగర్‌కు చెందిన మజర్ అలీ అన్సారీ పెళ్లి చేసుకుని ఐదేళ్లు గడిచింది. ఆయన తన భార్యతో కలిసి ఖురేషీ నగర్‌లోనే కాపురం పెట్టాడు. కానీ, వారికి సంతానం కలుగలేదు. ఈ విషయమై ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పిల్లలు లేకుంటే తన జీవితం అసంపూర్ణమేనని మజర్ అలీ అన్సారీ తరుచూ తన ఆప్తుల దగ్గర వాపోయేవాడని తమకు తెలిసినట్టు చునాబట్టి పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు.

ఈ మనస్తాపంతోనే మజర్ అలీ అన్సారీ సోమవారం రాత్రి ఎలుకల మందు తీసుకున్నాడు. ఆ తర్వాతి రోజే సియాన్ హాస్పిటల్‌లో ఆయన మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. కాగా, మజర్ అలీ అన్సారీ అన్న పోలీసులతో మాట్లాడాడు. తమకు హత్య అనుమానాలు లేవని, ఎవరినీ తాము అనుమానించడం లేదని చెప్పాడు. 

పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు రూపొందించారు. ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.