ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు కారణంగా వేర్వేరు చోట్ల 14 మంది మరణించారు. బుధవారం ఒక్క రోజే పిడుగుల వల్ల 14 మంది మరణించడం గమనార్హం. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ప్రకటించారు.
లక్నో: ప్రకృతిని మనిషి అదుపులో పెట్టలేడు. మహా అయితే.. ముందస్తుగా సూచనలు కనిపెట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. విపత్తును నివారించడం దాదాపు అసాధ్యం కాబట్టి, వీటి వల్ల స్వల్ప నష్టం జరిగేలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ, ఈ ప్రయత్నాలు కూడా ఎప్పుడూ సఫలం కావాలనే ఏం లేదు. ఇప్పటికీ వరదలు వచ్చి.. పిడుగులు పడి మరణిస్తున్నవారి సంఖ్య అనూహ్యంగానే ఉంటున్నది. తాజాగా, బుధవారం ఒక్కరోజే ఉత్తరప్రదేశ్‌లో 14 మంది పిడుగుపాటుకు గురై మరణించారు. మరో 16 మంది పిడుగుపాటు వలన గాయపడ్డారు. వారికి చికిత్స అందుతున్నది.
రిలీఫ్ కమిషనర్స్ ఆఫీసు లెక్కల ప్రకారం, బండా జిల్లాలో నాలుగు మరణాలు, ఫతేపూర్‌లో రెండు, బలరాంపూర్, చంద్రౌలీ, బులందర్ షహర్, రాయ్ బరేలీ, అమేథి, కౌశాంబీ, సుల్తాన్‌పుర్, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.
ఈ ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ మరణాలపై దిగ్భ్రాంతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఆయన రూ. 4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఈ డబ్బులు అందజేయాలని సంబంధిత జిల్లాల మెజిస్ట్రేట్లను ఆయన ఆదేశించారు. అలాగే, ఈ పిడుగుపాటు కారణంగా గాయపడిన వారికి సరైన, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
