న్యూఢిల్లీ: భారత్ లో కరోనావైరస్ బారిన పడినవారి సంఖ్య 28కి పెరిగింది. వారిలో 15 మంది ఇటాలియన్ టూరిస్టులున్నారు. 15 మంది ఇటాలియన్ టూరిస్టులతో పాటు ఓ ఇండియన్ గత నెలలో భారతదేశానికి వచ్చారు. వారిని పరీక్షించగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దాంతో భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 28కి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ దాన్ని ధ్రువీకరించారు.  

కరోనా వైరస్ బాధితులు 28 మందిలో ఒకతను ఢిల్లీకి చెందిన 45 ఏళ్ల వ్యక్తి. అతను ఇటీవలే ఇటలీ వెళ్లాడు. మరో ఆరుగురు ఆగ్రాకు చెందిన అతని కుటుంబ సభ్యులు. అతని నుంచి కరోనా వీరికి అంటినట్లు భావిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాదు వచ్చిన ఓ టెక్కీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 

Also Read: భారత్‌లోని కీలక రంగాలకు కరోనా వైరస్‌ ముప్పు

తొలుత మూడు కేసులు కూడా కేరళలో నమోదయ్యాయి. వారు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ట్విట్టర్ వేదిక ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. ఈసారి తాను హోలీ సంబరాల్లో పాల్గొనడం లేదని కూడా ఆయన చెప్పారు. 

కోవిడ్ - 19 నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారు. తాను కూడా హోలీ సంబరాలకు దూరంగా ఉంటానని చెప్పారు. 

See Video: వైరల్ వీడియో : కరోనా దెబ్బకు మైండ్ స్పేస్ ఖాళీ!

కరోనా వైరస్ మీద ప్రధాని మోడీ బుధవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. భయాందోళనలకు గురి కావద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు సూచించారు. 

హర్షవర్ధన్ లెక్కల ప్రకారం... ఢిల్లీ, హైదరాబాదుల్లో ఒక్కరేసి, ఆగ్రాకు చెందినవారిలో ఆరుగురికి, జైపూర్ లో 17 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వారిలో 16 మంది ఇటాలియన్ టూరిస్టులు కాగా, ఒక్కరు ఇండియన్ డ్రైవర్.