లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండు క్రికెట్ జట్టు సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకతో తలపడే టెస్టు సిరీస్ లో తాము ఆ దేశపు ఆటగాళ్లతో కరచాలనం చేయబోమని ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ చెప్పాడు. ఈ నెల 19వ తేదీ నుంచి ఇంగ్లాండు, శ్రీలంక మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 

ఇటీవల దక్షిణాఫ్రికాకు పర్యటనకు వెళ్లిన తమ జట్టు అక్కడ అనారోగ్య సమస్యలను ఎదుర్కుందని, పది మంది ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా అంతు చిక్కని వ్యాధి సోకిందని జోరూట్ మంగళవారంనాడు చెప్పాడు. దాంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టు మ్యాచులో సిరీస్ లో ఆ జట్టు సభ్యులతో తాము కరచాలనం చేయబోమని చెప్పాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో తమ జట్టు సభ్యులు అనారోగ్యానికి గురైన తర్వాత సాధ్యమైనంత వరకు ఇతరులకు తాము దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపాడు. అధికారికంగా తమ వైద్య బృందం జట్టుకు పలు సలహాలు ఇచ్చిందని, ప్రమాదకరమైన బాక్టీరియా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిందని ఆయన అన్నాడు. 

ఈ స్థితిలో తాము ఇతరులతో చేతులు కలుపబోమని, అందుకు బదులుగా ఫిస్ట్ బంప్స్ పద్ధతిని పాటిస్తామని, అలాగే తాము తరుచుగా చేతులు శుభ్రం చేసుకుంటామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ఈ సిరీస్ నిర్వహణకు ఆటంకం కలుగుతుందనే సమాచారం తమకు లేదని చెప్పాడు. తాము అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి సూచనల మేరకు నడుచుకుంటామని జోరూట్ చెప్పాడు.