ముంబై తాజ్‌హోటల్‌లో ఆరుగురికి కరోనా: ఉద్యోగుల్లో ఆందోళన
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన తాజ్ హోటల్‌లో ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగింది. దీంతో వీరిని శనివారం బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
భారతదేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రంలోనూ, ఆ రాష్ట్రంలో ముంబైలో కేసుల ఉద్థృతి ఎక్కువగా ఉంది. శనివారం నాటికి అక్కడ 1,574 మంది కరోనా వైరస్ బారినపడగా, 110 మంది మరణించారు.
ఒక్క ముంబై మహానగరంలోనే వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌తో పాటు ఇతర నిబంధనలను సైతం కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసులను కట్టడి చేయలేకపోవడంతో ఉద్ధవ్ సర్కార్ తలలు పట్టుకుంటోంది.
Also Read:వలసకూలీలు వైరస్ వ్యాప్తికి దోహదం చేసే ఛాన్స్: ప్రపంచ బ్యాంక్
తాజాగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన తాజ్ హోటల్‌లో ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కలకలం రేగింది. దీంతో వీరిని శనివారం బాంబే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా పాజిటివ్‌గా తేలిన వారితో కలిసి పనిచేసిన ఉద్యోగులు, మరికొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
Also Read:కరోనాను జయించిన ఆర్నెళ్ల చిన్నారి: చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం
కాగా ప్రస్తుతం తమ గ్రూప్ ఆధ్వర్యంలోని హోటల్స్ మూసివేసి ఉన్నాయని, కాకపోతే అక్కడి సామాగ్రిని.. ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నారని తాజ్ హోటల్స్ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 918 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 8,447కు చేరింది. ఇదే సమయంలో 31 మంది మరణించడంతో మృతుల సంఖ్య 273కి చేరింది. 765 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.