బెంగళూరు: హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. అతను బెంగళూరు నుంచి హైదరాబాదుకు ప్రయాణించడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగళూరులో అతనితో సన్నిహితంగా మెలిగినవారి గురించి ఆరా తీస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా 88 వేల మందికి సోకినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 వేల మంది దాకా మరణించారు. చైనా నుంచి కరోనావైరస్ ఇతర దేశాలకు పాకుతోంది. కొత్తగా భారతదేశంలో ఇద్దరికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒకరు ఢిల్లీకి చెందినవారు కాగా, రెండో వ్యక్తి హైదరాబాదుకు చెందిన వ్యక్తి.

కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన టెక్కీ హైదరాబాదుకు బెంగళూరు నుంచి బస్సులో ప్రయాణించాడు. బస్సులో ప్రయాణించిన మిగతావారి గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుండగా, కర్ణాటక ప్రభుత్వం అతనికి సన్నిహితంగా ఉన్న బెంగళూరువాళ్ల గురించి ఆలోచన చేస్తోంది. 

వీడియో చూడండి: తెలంగాణలో కరోనా : వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో లేదు

తాజాగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన ఇద్దరి పరిస్థితి కూడా నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు బెంగళూరులో పనిచేస్తున్నాడు. అతను దుబాయ్ లో హాంగ్ కాంగ్ నుంచి వచ్చినవారితో పనిచేశాడు. దీంతో వారి నుంచి ఇతనికి వైరస్ సోకినట్లు తెలుస్తోందని తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. 

24 ఏళ్ల హైదరాబాద్ టెక్కీ 19 లేదా 20వ తేదీన బెంగళూరు చేరి ఆ తర్వాత హైదరాబాదు ప్రయాణించినట్లు తెలుస్తోంది. జ్వరం వచ్చిందనే ఉద్దేశంతో అతనికి చికిత్స చేశారు. అది తగ్గకపోవడంతో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతను గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు అతనికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. 

Also Read: హైదరాబాద్ కరోనా బాధితుడు.. అతని వల్ల 80 మందికి ముప్పు: ఈటల

బెంగళూరులో హైదరాబాద్ టెక్కీతో ఉన్నవారందరినీ గుర్తించినట్లు, వారిని పరీక్షిస్తు్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములు చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. 

ఇదిలావుంటే, ఇటలీ నుంచి రాజస్థాన్ కు వచ్చిన ఇటలీ టూరిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. జైపూర్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాత టూరిస్టుకు కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు తేల్చారు. శాంపిల్స్ ను పూణేలోని వైరాలజీ జాతీయ సంస్థకు పంపించారు. 

అత్యంత అవసరమైతే తప్ప ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియా, సింగపూర్ లకు ప్రయాణాలు పెట్టుకోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రజలను కోరారు. కరోనా వైరస్ తో తీవ్ర ప్రభావానికి గురైన ఇరాన్, ఇటలీలోని భారతీయులను రప్పించడానికి ఆ దేశాల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఖాట్మండు, ఇండోనేషియా, వియత్నాం, మలేసియా, చైనా, హాంగ్ కాంగ్, ఇరాన్, ఇటలీ, థాయ్ లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ ల నుంచి  వస్తున్నవారిని 21 విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.