Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో 78కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు: కేరళలో అత్యధికం

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని 114 దేశాలకు విస్తరించింది. దీని బారినపడి ఇప్పటి వరకు 4 వేల మంది మరణించగా, లక్షకు పైగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

coronavirus cases climb to 78 in India
Author
New Delhi, First Published Mar 13, 2020, 3:36 PM IST

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలోని 114 దేశాలకు విస్తరించింది. దీని బారినపడి ఇప్పటి వరకు 4 వేల మంది మరణించగా, లక్షకు పైగా ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ మహమ్మారి భారతదేశంలోనూ పంజా విసురుతోంది.

మనదేశంలో ఇప్పటి వరకు 78 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళలో అత్యధికంగా 17 కేసులు నమోదవ్వగా, మహారాష్ట్రలో 11, యూపీలో 10, ఢిల్లీలో 6, కర్ణాటకలో 5, ఏపీ, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్‌లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. వీరిలో 17 మంది విదేశీయులు కాగా, మిగిలిన వారంతా భారతీయులే.

Also Read:కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

దేశంలో ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల 57 వేల మంది ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపింది. వైరస్ తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు పర్యాటక వీసాలన్నీ రద్దు చేసింది. మార్చి 13 నుంచి మొదలయ్యే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను హర్యానా ప్రభుత్వం ఎపిడమిక్‌గా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 44 మంది అనుమానితుల నమూనాలను ప్రయోగశాలకు పంపగా వీటిలో 38 మందికి కోరోనా నెగిటివ్ వచ్చింది.

ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండకుండా సూచనలు చేసి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అభ్యర్ధించారు.

మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం రెండో విడతలో 44 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

ఇరాన్‌లో చిక్కుకుపోయిన 100 మంది భారతీయుల రక్త నమూనాలను వారం రోజుల కింద విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నమూనాలను పరీక్షించిన తర్వాత వైరస్ లేదని నిర్ధారణ అయిన వారిని భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read:భారత్‌లో తొలి కరోనా మరణం: మృతుడికి సపర్యలు, హైదరాబాద్‌లో నర్స్ నిర్బంధం

ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులకు రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కేరళలోని పత్తనంథిట్ట జిల్లాల్లో దాదాపు 900 మంది కరోనా అనుమానితులను స్వీయ నిర్బంధంలో ఉంచారు. ఈ జిల్లాలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారి సన్నిహితులు, ఇరుగు పొరుగు వారిని అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios