కరోనా వైరస్ కరాళ నృత్యానికి ప్రపంచమంతా వణికిపోతుంది. అన్ని దేశాలు కూడా తోచిన పద్దతులను పాటిస్తూ ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. అందుకోసమే ప్రపంచంలోని అన్ని దేశాలతో సహా భారత్ కూడా లాక్ డౌన్ ప్రకటించింది. 

ఇలా లాక్ డౌన్ ఉండడంతో నిత్యావసరాలు తప్ప వేరే ఎటువంటి దుకాణాలు ఉండడంలేదు. దీనితో మద్యానికి బానిసలైన వారు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. విపరీతంగా ప్రవర్తించడంతోపాటుగా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. 

దేశమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మందుబాబుల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం వారికో గుడ్ న్యూస్ చెప్పింది. మందు లేకుండా తల్లడిలుతున్న వారికి ఇక మీదట మందు  అందించనున్నట్టు తెలిపింది కేరళ ప్రభుత్వం. కాకపోతే వారు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని తీసుకొని రావలిసి ఉంటుంది. 

Also Read:యూపీ టు యూకే.. వైరల్ అవుతున్న కనికా, ప్రిన్స్‌ చార్లెస్‌ ఫోటోలు

ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మరోవైపు మద్యాన్ని మానేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే చికిత్స అందించాలని, డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.  

ఇక తెలంగాణలో సైతం నిన్న మద్యం దొరక్క ఒక వ్యక్తి బ్లేడుతో కడుపు కోసేసుకున్నాడు. ఈ ఘటన ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బోధన్ నివాసముంటున్న సయ్యద్ ఎజాజ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరక్కపోతుండడంతో అతడు పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. 

మద్యం దొరకక పిచ్చి పట్టినట్టు అరుస్తూ బ్లేడ్ తో తన కడుపును కోసుకున్నాడు. ఒక్కసారిగా ఈ ఘటనతో అవాక్కయిన కుటుంబసభ్యులు, బస్తి వాసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. 

తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు అక్కడ  వైద్యులు అతడికి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతానికి అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలియవస్తుంది. 

మందుబాబులు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ మందు దొరక్క విలవిల్లాడుతున్నారు. ఊళ్లలో అయితే నాటుసారా గుడుంబా, కల్లు ఏదైనా సరే కిక్కే లక్ష్యం అన్నట్టుగా తాగేస్తున్నారు. హైద్రాబాద్ లో మందు దొరక్క ఒక మందుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకంగా మందుబాబులు మందు షాపులకు కన్నాలు వేయడానికి కూడా వెనకాడడం లేదు. 

ఇటువంటి సంఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి కూడా. ఇక ఊర్లలోనయితే ఉదయం నుండే కల్లు కోసం క్యూలు కడుతున్నారు. ఈత కల్లు తాటి కల్లు అని తేడా లేకుండా ఏదైనా సరే నషా ఎక్కితే చాలన్నట్టుగా మీదపడి తాగేస్తున్నారు. సాధారణంగా 20 రూపాయలుండే సీసా ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంటుంది. 

ఇకపోతే తెలంగాణలో మద్యం షాపులను రేపటి నుండి మద్యాహ్నం పాటు ఒక రెండున్నర గంటల పాటు తెరిచి ఉంచుతామని చెప్పే ఒక ఫేక్ సర్కులర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఈ ఫేక్ న్యూస్ ను కూడా మందు బాబులు తెగ షేర్ చేస్తున్నారు. అందులో గ్రామర్ ను బట్టి చూస్తే ఇదేదో ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ మందుబాబుల మద్యం లవ్ వారిని కనీసం ఆ పోస్టును పూర్తిగా కూడా చదవనివ్వడంలేదు. చదువొచ్చినవారు, చదువు రానివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మందు లవర్ దాన్ని ఫార్వర్డ్ చేసాడు. 

సోషల్ మీడియా గ్రూపుల్లో నెలరోజులపాటు మందు కొనుక్కొని పెట్టుకోవాలని తెగ చర్చలు కూడా పెడుతున్నారు. ఇలా మందుబాబులకు ఒక్కసారిగా ఇది ఫేక్ న్యూస్ అని తెలియగానే తెగ బాధపడిపోతున్నారు. 

ఇకపోతే ఊళ్లలో కల్తీ మందు కూడా ఏరులై పారుతుంది. నాటుసారా, గుడుంబా అనే తేడా లేకుండా దానికోసం జనం ఎగబడుతున్నారు. ఫారిన్ మందులు మాత్రమే తాగే మందుబాబులు కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు.