ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే లక్షల మందికి సోకిన ఈ వైరస్, వేల మందిని పొట్టన బెట్టుకుంది. దీన్ని కట్టడి చేసే దారుల కోసం ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురి  నిర్లక్ష్యం కారణంగా వైరస్ మరింత ఉదృతమవుతుంది. అత్యంత వేగంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ఈ వైరస్‌ మనదేశంలోనూ భయోత్పాతం సృష్టిస్తోంది.

ఇటీవల దేశంలో బాలీవుడ్ గాయని కనికా కపూర్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లండన్‌ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు కొద్ది రోజుల తరువాత కరోనా పాజిటివ్‌ గా గుర్తించారు. అయితే ఈ లోగా ఆమె పలు ప్రైవేట్‌ పార్టీలో పాల్గొనటం, ఆ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనటం సంచలనంగా మారింది. కరోనాపై ప్రభుత్వం విధించిన నిబంధనలు బేఖాతరు చేసినందుకు, కరోనా సోకినా తరువాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమె పై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు కనికా వ్యవహారం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.

తాజాగా బ్రిటన్‌ రాకుమారుడు చార్లెస్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనికా, చార్లెస్‌ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ ఫోటోల్లో కనికా ప్రిన్స్‌ చార్లెస్‌ తో మాట్లాడుతోంది. దీంతో నెటిజెన్లు మరోసారి కనికా పై విమర్శలు గుప్పిస్తున్నారు. యూవీ టు యూకే కనిక కారణంగానే ప్రిన్స్‌ చార్లెస్‌ కు కరోనా అంటూ విమర్శిస్తున్నారు నెటిజెన్లు.

అయితే ఈ ఫోటోలు ఇప్పటివి కావని తెలుస్తోంది. 2015లో ప్రిన్స్‌ చార్లెస్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కనికా పాల్గోన్న సందర్భంగా తీసిన ఫోటోలు అని తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కనికా కపూర్‌ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇప్పటికే మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా మూడో సారి కూడా పాజిటివ్‌ గానే వచ్చింది.