దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. గుడి, బడి, బహిరంగప్రదేశాలు, కార్యాలయాలు ఎక్కడా స్త్రీకి రక్షణ ఉండటం లేదు.  మైకు దొరికినప్పుడల్లా మహిళల రక్షణ, సాధికారతలపై గొంతు చించుకునే కాంగ్రెస్ పార్టీ‌కి.. తన కార్యాలయంలో సైతం లైంగిక వేధింపుల పర్వం చోటు చేసుకుని తలనొప్పులు తెప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ  సోషల్ మీడియా వింగ్‌లో పనిచేసే ఓ 28 ఏళ్ల యువతి తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ సోషల్ మీడియా ఛైర్‌పర్సన్ దివ్య స్పందన, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పార్టీలో కలకలం రేపింది. దీనిని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ మీడియాకు వివరించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్‌ ఛైర్‌పర్సన్ దివ్య స్పందన వద్ద సహాయకుడిగా పనిచేసే చిరాగ్ పట్నాయక్ ‌తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు.. యువతి జూన్ 11న తనకు ఫిర్యాదు చేసినట్టు కమీషనర్ తెలిపారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు వెల్లడించారు.. అయితే చిరాగ్ ప్రవర్తనపై అంతకు ముందే ఏఐసీసీ గ్రీవెన్స్ సెల్ ఛైర్‌పర్సన్‌ అర్చనా దాల్మీయాకు జూన్ 28న తాను లేఖ రాసినట్లు యువతి తెలిపింది. ఆ లేఖలో తాను పనిలో నిమగ్నమై ఉండగా.. పట్నాయక్ ఏదో  ట్వీట్లు చేయడానికని పదేపదే తన వద్దకు ఉద్దేశ్యపూర్వంగా వచ్చేవాడని.. అలా నాకు అతి దగ్గరగా జరుగుతూ.. ట్వీట్టర్ ‌‌ఖాతాను తనిఖీ చేస్తున్నట్లు నటించేవాడని తెలిపింది. అప్పుడే అతని ఉద్దేశ్యం ఏంటో తనకు అర్థమైందని వివరించింది. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయని.. తర్వాతి రోజు నుంచి పదే పదే తన చేతిపైన, భుజం పైన తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. అతనికి తనకు దూరం కేవలం 1.2 మీటర్లేనని చిరాగ్ తన కాలిని తన కాలితో నిమిరేవాడని... తన శరీర భాగాల వంక తదేకంగా చూస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని.. అందువల్ల ఆ వాతావరణంలో పనిచేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అతని వేధింపులు భరించలేక దివ్య స్పందనకు ఫిర్యాదు చేయగా.. ఆమె ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకున్న అధికారాలతో తనను అందరిముందు తిట్టేదని.. నా ఉద్యోగం పోతుందని కూడా లెక్కచేయకుండా నేను ఆమెకు ఫిర్యాదు చేశానని.. మాటలతో, చేతలతో తనను ఏ విధంగా వేధించాడనేది యువతి తెలిపింది. తన ఫిర్యాదుకు కనీసం స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి మే 22న తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. 
సదరు యువతి ఢిల్లీ లోని గురుద్వారా రకాబ్‌గంజ్‌ వద్ద ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రధాన కార్యాలయంలో .. సోషల్ మీడియా మేనేజర్‌గా మార్చి 5న విధుల్లో చేరింది. ఈమె తన రోజువారీ వ్యవహారాలను దివ్య స్పందనకు రిపోర్ట్ చేస్తుండేది.. వీరిద్దరికి పట్నాయక్ సమన్వయకర్తగా వ్యవహారించేవాడు. నా పోరాటం ఓ వ్యక్తి మీదే కాని.. పార్టీ మీద కాదని సదరు యువతి స్పష్టం చేసింది. నన్ను ఇబ్బంది పెట్టినవారు శిక్షించబడాలన్నదే తన ధ్యేయమని తెలిపింది. బాధితురాలు తన వేధింపులపై, మానసిక ఆవేదనపై మే 14న దివ్య స్పందనకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా.. పని పేరు చెప్పి తన దృష్టిని మళ్లీంచేందుకు ప్రయత్నించినట్లు యువతి వాపోయింది. మే 17 నుంచి 24 వరకు తాను తీవ్ర మనోవేదన పడినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు చివరిలో ‘‘స్పందన గారు మీరు నా పట్ల ప్రవర్తించిన తీరు ఏ మాత్రం సబబుగా లేదు. అతన్ని మందలించకపోగా.. కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రూప్‌లో నా తప్పు ఏం లేకపోయినా .. పని గురించి తప్పుడు సందేశాలు పంపి నన్ను అవమానించారు.. నా ఉద్యోగ ధర్మాన్ని, నైతిక విలువలను ప్రశ్నించారని పేర్కొంది. ఈ పరిణామాల వల్ల నేను మే 23 నుంచి ఆఫీసుకు వెళ్లబుద్ది కాలేదని స్పష్టం చేసింది.

స్పందనతో పాటు ఫిర్యాదుల కమిటీ నిందితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించలేదని తెలిపింది. ఇప్పుడు మాజీ  ఉద్యోగిగా స్పందన ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నామని.. సదరు ఫిర్యాదులో నా టీమ్‌లోని 39 మంది సభ్యుల సంతకాలు పెట్టి నా వెనుకాల నిల్చున్నారని యువతి వెల్లడించింది. కాగా, ఆమె వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం వల్ల మాత్రమే ఉద్యోగానికి రాజీనామా చేశారని.. చివరకు రిజైన్ లెటర్‌లో కూడా ఇక్కడ పని చేయడం తనకెంతో నచ్చిందని..ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిందని దివ్య స్పందన మీడియాకు విడుదల చేసిన  ప్రకటనలో తెలిపారు. ఇక పోలీసులకు చేసిన ఫిర్యాదులో సాధారణ ప్రొటోకాల్ ప్రకారమే చిరాగ్ పట్నాయక్ ఆమె చేస్తున్న పనిని తనిఖీ చేసేందుకు వెళ్లాడని.. కానీ తన అతను తన హోదాను అడ్డం పెట్టుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. ఇక ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని బీజేపీ తదితర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ను విమర్శించే అవకాశం వుందని విశ్లేషకులు తెలిపారు.