తొందర్లోనే మోడీ 3.0 , ఈసారి మీకు 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా .. కాంగ్రెస్‌కు ప్రధాని చురకలు

లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ . 40 సీట్లు అయినా గెలవాలని తాను కోరుకుంటున్నానని మోడీ చురకలంటించారు. మన మూడో విడత పదవీ కాలం ఎంతో దూరంలో లేదన్నారు. 

Congress's Slave Mentality Led To World Undermining India says pm narendra modi at rajya sabha ksp

లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. బుధవారం రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్ బానిస మనస్తత్వం కారణంగా ప్రపంచం భారతదేశాన్ని అణగదొక్కడానికి దారితీసిందన్నారు. కాంగ్రెస్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలని , విపక్షాల దుస్ధితికి కాంగ్రెస్సే జవాబుదారీ అన్నారు. కాంగ్రెస్ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలని.. ఉత్తరం, దక్షిణం పేరుతో దేశాన్ని విడదీయాలని చూస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. మన దేశ భూభాగాల్లో చాలా వరకు కాంగ్రెస్ శత్రు దేశాలకు అప్పగించిందని , సైన్యం ఆధునికీకరణను నిలిపివేసిందని ఎద్దేవా చేశారు. 

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిందని, ఇప్పుడు ఆ పార్టీ మనకు జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోందని కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో వారి నాయకులు, విధానాలకు ఎలాంటి గ్యారంటీ లేదని.. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేసిందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చామని.. కాంగ్రెస్ పాలకులు వారి కుటుంబీకులకు మాత్రమే అత్యున్నత పురస్కారాలను అందించారని మోడీ దుయ్యబట్టారు. 1990లో కేంద్రంలో తమ మద్ధతుతో వున్న ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించిందని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. 

ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ .. కాంగ్రెస్ పార్టీ కనీసం 40 స్థానాలు కూడా సాధించలేదని సవాల్ విసిరారు.. కానీ తాను మాత్రం 40 సీట్లు అయినా గెలవాలని తాను కోరుకుంటున్నానని మోడీ చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో తమకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే పేర్కొన్నారని.. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నానని, అదే నిజమవుతుందని ప్రధాని తెలిపారు. అయితే ఆ రోజు సభలో అంత సుదీర్ఘంగా , అంత స్వేచ్ఛగా ఎలా మాట్లాడారోనని తనకు ఆశ్చర్యం వేసిందని మోడీ వ్యాఖ్యానించారు. బహుశా ఖర్గే మాట్లాడిన రోజు కాంగ్రెస్ స్పెషల్ కమాండర్లు సభకు రాలేదేమోనని ప్రధాని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒకే ఉత్పత్తిని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తూ వుంటుందని అందుకే వారి దుకాణం మూతబడుతోందని పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు నరేంద్ర మోడీ. 

దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన అతి పెద్ద పార్టీ ఇలా మారిపోతున్నందుకు తనకు సంతోషం లేదని , పైగా జాలి కలుగుతోందని చురకలంటించారు. అలాంటి కాంగ్రెస్.. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం గురించి ప్రబోదిస్తుందా.. భాష ఆధారంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడం సహా వాళ్లు ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని మోడీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని, ఈశాన్య దేశాన్ని వెనుకబాటుకు గురిచేశారని.. మావోయిజాన్ని దేశానికి సవాల్‌గా మార్చారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై దేశం ఎందుకు కోపం వుంది, ప్రజలు అంతగా కోపగించుకోవడానికి కారణం ఏంటీ అంటే ఇది వారు నాటిన విత్తనం ఫలమే. 

కాంగ్రెస్ పాలనలో దేశం బలహీనమైన ఐదు ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటిగా వుండేదని, తాము దానిని పదేళ్లలోనే టాప్ 5 ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా మార్చామని మోడీ తెలిపారు. బ్రిటీష్ వారి నుండి ఎవరు ప్రేరణ పొందారు? కాంగ్రెస్‌ను ఎవరు పుట్టించారని తాను అడగడం లేదని.. స్వేచ్ఛ తర్వాత కూడా బానిస మనస్తత్వాన్ని ప్రోత్సహించింది ఎవరు? అని ప్రధాని ప్రశ్నించారు. అండమాన్ దీవుల్లో బ్రిటీష్ పాలన సంకేతాలు ఎందుకు వున్నాయి..? జవాన్ల కోసం యుద్ధ స్మారకం ఎందుకు నిర్మించలేదు..? భారతీయ భాషలను ఎందుకు చిన్న చూపు చూశారని మోడీ నిలదీశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించాలని అనుకుంటున్నామని.. 20వ శతాబ్ధపు ఆలోచనలకు స్థానం లేదన్నారు. 

రిజర్వేషన్లకు వ్యతిరేకమని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమంత్రులకు ఆ రోజుల్లో లేఖలు రాశారని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు వస్తే ప్రభుత్వ ప్రమాణాలు పడిపోతాయని నెహ్రూజీ భావించారని మోడీ గుర్తుచేశారు. ఈ ఉదాహరణలను బట్టి కాంగ్రెస్ మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చునని.. ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు హక్కులు కల్పించలేదని ఆర్టికల్ 370 రద్దు తర్వాతే వారికి ఆ హక్కులు లభించాయని ప్రధాని తెలిపారు. ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు చెందినవారి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయినప్పుడు కొత్త వాతావరణం ఏర్పడుతుందని మోడీ వెల్లడించారు. 

పేదలకు ₹ 5 లక్షల వరకు ఉచిత చికిత్స, మందులలో 80 శాతం రాయితీ , కిసాన్ సమ్మాన్‌ నిధి పథకం , పక్కా ఇళ్ల నిర్మాణ పథకం , నల్‌సే జల్‌ యోజన కొనసాగుతుందని, మరుగుదొడ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మన మూడో విడత పదవీ కాలం ఎంతో దూరంలో లేదు. కొంతమంది మోడీ 3.0 అని పిలుస్తున్నారు.. మోడీ 3.0 విక్షిత్ భారత్ పునాదిని బలోపేతం చేస్తుందని నరేంద్ర మోడీ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios