దక్షిణ భారతదేశం నుంచి బీజేపీని కర్ణాటక ప్రజలు వెళ్లగొట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డు స్కీములను అమలు చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. 

కర్ణాటకలో గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగిందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య తదితర నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ కార్యకర్తల విజయమన్నారు. కర్ణాటక అసెంబ్లీపై కాంగ్రెస్ జెండా ఎగురవేశామని.. కాంగ్రెస్‌ను గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఖర్గే. బీజేపీ కాంగ్రెస్‌ను చాలా అవమానకరంగా మాట్లాడిందని మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ముక్త దక్షిణ భారత్ ఇప్పుడు ఏర్పడిందని.. 35 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు 136 సీట్లు దక్కాయని ఆయన గుర్తుచేశారు. 

దక్షిణ భారతదేశం నుంచి బీజేపీని కర్ణాటక ప్రజలు వెళ్లగొట్టారని ఖర్గే అన్నారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు మల్లిఖార్జున ఖర్గే. మోడీ గెజరాత్ పుత్రుడైతే..తాను కర్ణాటక పుత్రుడినని ఖర్గే అన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడారని.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కృషి వల్లే కర్ణాటకలో ఘన విజయం సాధించామని ఆయన ప్రశంసించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డు స్కీములను అమలు చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. తొలి కేబినెట్‌లోనే గ్యారెంటీ కార్డు స్కీములపై సంతకం చేయాలని ఆయన కోరారు. 

ALso Read: NOTA: కర్ణాటకలో ఎన్ని లక్షల మంది నోటాకు ఓటేశారో తెలుసా?

మాజీ సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై తమ కేబినెట్ తొలి సంతకం చేస్తుందన్నారు. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు చేసిందని.. మోడీ పదిసార్లు రోడ్ షోలు చేసినా జనం పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశమని.. 2024లోనూ ఇదే విజయాన్ని సాధిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. 

అంతకుముందు కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అభినందనలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆమె స్పందించారు. ఈరోజు ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు వారి సమస్యలను పరిష్కరించే రాజకీయాలను, వారి సమస్యలను చర్చించే రాజకీయాలను కోరుకుంటున్నారని నిరూపించారని చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా సందేశం పంపారని తెలిపారు.

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఫిరాయింపు రాజకీయాలు ఇక సాగవని నిరూపించారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము కర్ణాటకలో విజయం సాధించామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌లో జోష్ నింపిందని అన్నారు. తాను దాదాపు నెల రోజుల పాటు కర్ణాటకలో ఉన్నానని.. వారి నాయకత్వంలో పనిచేశానని చెప్పారు. శివకుమార్, సిద్దరామయ్య‌తో కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు అని చెప్పారు.